ప్రభాస్ ‘ఫౌజీ’కి తెర మీదే కాదు… తెర బయటా ఇద్దరు భారీ విలన్స్!
ప్రభాస్ హీరో గా సినిమా అంటే తెరపై ఓ పవర్ఫుల్ విలన్ తప్పనిసరి. ప్రేక్షకులు కూడా అదే ఆశిస్తారు. కానీ ఈసారి కథ వేరు. ప్రభాస్ తాజా చిత్రం ఫౌజీ రిలీజ్ కు ఇంకా సమయం ఉండగానే బాక్సాఫీస్ దగ్గర ఆయన్ని ఢీ కొట్టడానికి ఇద్దరు భారీ విలన్స్ ఎదురుచూస్తున్నారు. వాళ్లిద్దరినీ దాటుకుని ఫౌజీ ఎలా నిలబడుతుందన్నదే ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయంగా మారింది. ఇంతకీ ఆ విలన్స్ ఎవరూ… ఎందుకింత టెన్షన్?
ప్రభాస్ ముందు నిలిచిన ఆ ఇద్దరు విలన్స్ ఎవరు?
డిసెంబర్లో ఫౌజీ విడుదలయ్యే సమయానికి ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలు ఉన్న రెండు హాలీవుడ్ చిత్రాలు కూడా థియేటర్లలోకి రానున్నాయి. అవే అవెంజర్స్: డూమ్స్‌డే, డ్యూన్: పార్ట్ త్రీ. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను కలిగిన ఈ రెండు ఫ్రాంచైజీలు భారత మార్కెట్‌ను కూడా భారీగానే టార్గెట్ చేస్తున్నాయి.
ప్రత్యేకంగా ఐమాక్స్, ప్రీమియం మల్టీప్లెక్స్ స్క్రీన్లలో వీటి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అదే ఫౌజీకి నిజమైన ఛాలెంజ్ గా మారుతుందనేటి ట్రేడ్ వర్గాల అంచనా. ఎందుకు హాలీవుడ్ ని చూసి ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా ఆలోచనలో పడాలి?
స్పైడర్‌మ్యాన్ ఇంపాక్ట్
ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఇటీవల జరిగిన ఒక ఉదాహరణ చూడాలి. స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే విడుదలైన తర్వాత తెలుగు మార్కెట్లో ఆసక్తికరమైన మార్పు కనిపించింది. సినిమా గురించి డివైడ్ రెస్పాన్స్ వచ్చినా, థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ మాత్రం తగ్గలేదు. అదే సమయంలో మంచి ఓపెనింగ్ సాధించిన కొన్ని తెలుగు సినిమాలు ఒక్కసారిగా స్లో అయ్యిపోయాయి. కొన్ని సెంటర్లలో షోలు కూడా తగ్గించి స్పైడర్ మ్యాన్ కు కేటాయించాల్సి వచ్చింది.
దీంతో ఒక విషయం స్పష్టమైంది. హాలీవుడ్ సినిమాలు ఇప్పుడు కేవలం మన వాళ్లకు ఎగస్ట్రా ఎంటర్ట్నైమెంట్ మాత్రం కాదు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ప్రేక్షకులను తమవైపు తిప్పుకునే శక్తిని సంపాదించుకున్నాయి. చిన్న చిన్న టౌన్ లలోనూ స్పైడర్ మ్యాన్ కలెక్షన్స్ అదరగొట్టాయి. దాంతో సినిమా వర్గాల్లో ఈ కొత్త చర్చ మొదలైంది. ఈ ట్రెండ్ ఇక్కడితో ఆగుతుందా? ప్రభాస్ లాంటి హీరోల సినిమాలపై కూడా ఇంపాక్ట్ చూపెడుతుందా అని.
ఫౌజీపై అంచనాలు ఎలా ఉన్నాయి?
మరోవైపు ఫౌజీ కూడా సాధారణ సినిమా కాదు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న తొలి పీరియడ్ ఎమోషనల్ డ్రామా కావడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ప్రభాస్ లుక్, సినిమా నేపథ్యం అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని పెంచాయి. మాస్ స్టార్‌గా కనిపించే ప్రభాస్‌ను ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో చూడబోతున్నామనే అంచనా కూడా ఉంది.
అందుకే ఈ సినిమా కేవలం అభిమానులకే కాదు, ట్రేడ్ వర్గాలకూ ఎంతో కీలకంగా మారింది. కానీ అంచనాలు మాత్రమే బాక్సాఫీస్‌ను గెలిపిస్తాయా?
హాలీవుడ్‌ను దాటే సత్తా ప్రభాస్‌కు లేదా?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ప్రభాస్ కెరీర్‌ను చూడాలి. బాహుబలి, సలార్, కల్కి 2898 AD సినిమాలతో ఆయన దేశవ్యాప్తంగా భారీ మార్కెట్‌ను నిర్మించుకున్నారు. ఓపెనింగ్ కలెక్షన్ల విషయంలో ఇప్పటికీ ప్రభాస్‌కు సమానంగా నిలిచే భారతీయ హీరోలు చాలా తక్కువ మంది. అందుకే ఫౌజీ మొదటి మూడు రోజుల్లో భారీ వసూళ్లు సాధించే అవకాశాలపై పెద్దగా ఎవరికీ సందేహాలు లేవు.
అయితే అసలు పరీక్ష ఓపెనింగ్ కాదు. రెండో వారం, మూడో వారం కూడా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగలదా అన్నదే కీలకం. అదే చోట హాలీవుడ్ ప్రభావం కనిపించే అవకాశముందా?
కలెక్షన్లపై నిజంగానే ప్రభావం పడుతుందా?
ఈ విషయం తీసి పారేయలేనిది. అయితే అది మొత్తం అన్ని చోట్లా మీద కాదు. పట్టణ ప్రాంతాల్లోని మల్టీప్లెక్స్ ప్రేక్షకుల విషయంలో అయితే ఆ ఇంపాక్ట్ కనిపిస్తుందని ట్రేడ్ అంటోంది. అవెంజర్స్: డూమ్స్‌డే, డ్యూన్: పార్ట్ త్రీ రెండూ అద్భుతమైన టాక్ తెచ్చుకుంటే, కొంతమంది ప్రేక్షకులు వాటి వైపు మళ్లే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. అదే జరిగితే ఫౌజీ లాంగ్ రన్ కలెక్షన్లపై కొంత ప్రభావం పడొచ్చు.
అయితే అదే సమయంలో ఫౌజీ కూడా బలమైన కంటెంట్‌తో వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు. చివరికి ప్రేక్షకుడు ఎలాంటి సినిమాను ఎక్కువగా ప్రేమిస్తాడన్నదే బాక్సాఫీస్‌ను నిర్ణయిస్తుంది కదా?
చివరికి హీరోను గొప్పవాడిని చేసేది ఎవరు?
సినిమాల్లో హీరో స్ట్రాంగ్ గా,పవర్ ఫుల్ గా కనిపించాలంటే అతని ఎదురుగా నిలిచే విలన్ కూడా అదే స్దాయిలో, ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఉండాలి. బలహీనమైన విలన్ ఉంటే హీరో గెలిచినా ఆ విజయం గుర్తుండదు. కానీ భారీ ప్రత్యర్థిని ఓడిస్తే అదే చరిత్ర అవుతుంది.
బాక్సాఫీస్‌లో కూడా ఇప్పుడు ప్రభాస్ పరిస్థితి అలాంటిదే. ఎదురుగా నిలిచింది ప్రపంచంలోనే అతిపెద్ద రెండు సినిమా ఫ్రాంచైజీలు. అలాంటి విలన్స్‌ను దాటుకుని ఫౌజీ విజయం సాధిస్తే… అది మరో హిట్ మాత్రమే కాదు. ప్రభాస్ స్టార్డమ్కు మరో కొత్త అధ్యాయం కూడా అవుతుంది. డిసెంబర్లో ఆ కథ ఎలా ముగుస్తుందో ఎదురుచూద్దాం.








