“మిస్టరీ పార్సిల్” తో కోట్ల వ్యాపారం, ఆ మిస్టరీ ఏమిటి?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
మీకు గుర్తుందా…
చిన్నప్పుడు జాతరలో ఒక ఆట ఉండేది.
ఓ అట్ట..దాని మీద దేవుళ్ల ఫొటోలు… సినిమా హీరోల బొమ్మలు. ఒక రూపాయి ఇచ్చి మనకు నచ్చిన బొమ్మను పీకాలి. అదృష్టం ఉంటే మనం పీకిన వెనక ₹10 నోటు ఉండేది. లేకపోతే… ఖాళీ అట్టే. ఇక్కడ డబ్బు కంటే… “వెనక ఏముందా?” అన్న ఉత్కంఠే ఆ ఆటను మళ్లీ మళ్లీ ఆడించేది. ఇప్పుడు అదే ఆట… యూరప్‌లో కొత్త రూపంలో మళ్లీ పుట్టింది.
కానీ ఇప్పుడు అట్టలు లేవు. వాటి స్థానంలో Amazon, ఇతర ఆన్లైన్ షాపింగ్ కంపెనీల నుంచి తిరిగొచ్చిన పార్సిళ్లు ఉన్నాయి. లోపల ఏముందో ఎవరికీ తెలియదు. ప్రజలు డబ్బు కట్టి వాటిని కొనేస్తున్నారు.
అసలు ఏమిటీ “మిస్టరీ పార్సిల్”
నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇప్పుడు ఇలాంటి “మిస్టరీ పార్సిల్” దుకాణాలు భారీ ఆకర్షణగా మారాయి. అక్కడికి వెళ్లిన వారు పార్సిల్‌ను చేతిలో పట్టుకుని దాని బరువు చూస్తారు. కదిలించి లోపల ఏముంటుందో ఊహిస్తారు. తర్వాత ధర చెల్లించి అక్కడికక్కడే తెరుస్తారు. అది తెరిచిన తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది.
ఒక్కరికి దాదాపు ₹60 వేల విలువ చేసే స్మార్ట్‌ఫోన్ దొరికింది. మరోకరికి పైప్ రిపేర్ టూల్‌కిట్ వచ్చింది. ఇంకొకరికి కిచెన్ టైమర్. మరికొందరికి బేబీ బ్యాగ్, పరుపు, దుస్తులు… అంటే మీరు చెల్లిస్తున్నది వస్తువు కోసం కాదు… ఆశ్చర్యం కోసం.
అసలు ఈ పార్సిళ్లు ఎక్కడి నుంచి వస్తాయి?
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ కోట్లాది మంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. వస్తువు నచ్చకపోయినా, సైజు సరిపోకపోయినా, పొరపాటున ఆర్డర్ చేసినా తిరిగి పంపేస్తున్నారు. అన్ని వస్తువులను మళ్లీ కొత్తవిగా అమ్మడం కంపెనీలకు సాధ్యం కాదు. కొన్ని పార్సిళ్లపై అడ్రస్ దెబ్బతింటుంది. కొన్ని గోదాముల్లోనే మిగిలిపోతాయి. మరికొన్ని లిక్విడేషన్ కంపెనీలకు చాలా తక్కువ ధరకు అమ్మేస్తారు. ఇప్పుడు వాటినే ఈ దుకాణాలు కొనుగోలు చేసి… “మిస్టరీ పార్సిల్” గా మళ్లీ విక్రయిస్తున్నాయి.
ఇది షాపింగా… గ్యాంబ్లింగా?
ఈ ప్రశ్న చాలామందికి వస్తోంది. దుకాణ యజమానులు మాత్రం ఒకే మాట చెబుతున్నారు. “గ్యాంబ్లింగ్‌లో ఖాళీ చేతులతో వెళ్లిపోతారు. ఇక్కడ మాత్రం ఏదో ఒక వస్తువు మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది.” అయితే అసలు విషయం వస్తువులో లేదు. మనిషి మెదడులో ఉంది.
మనం వస్తువు కొనడం లేదు… డోపమైన్ కొంటున్నాం!
మనకు సర్ప్రైజ్ అంటే ఎందుకు ఇష్టం? సినిమా క్లైమాక్స్ ముందే చెబితే ఆసక్తి పోతుంది. గిఫ్ట్ కవర్ తెరవకముందు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. లాటరీ టికెట్ కొన్న తర్వాత ఫలితం వచ్చే వరకు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ మిస్టరీ పార్సిళ్లు కూడా అదే భావోద్వేగాన్ని అమ్ముతున్నాయి.వస్తువు విలువ ఎంత అన్నది తర్వాత విషయం. “లోపల ఏముందా?” అన్న ఆసక్తే అసలు ప్రొడక్ట్.
షాపింగ్ ఇప్పుడు వినోదంగా మారుతోంది
ఒకప్పుడు షాపింగ్ అంటే అవసరం. ఇప్పుడు అనుభవం. కాఫీ షాపులు ఫొటోల కోసం. రెస్టారెంట్లు వీడియోల కోసం. ఇప్పుడు ఈ మిస్టరీ పార్సిళ్లు… అన్బాక్సింగ్ కోసం. చాలామంది వస్తువు కోసం కాదు… వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడానికి కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు. చెత్తగా మారాల్సిన వస్తువులకు సెకండ్ లైఫ్.
ఈ ట్రెండ్‌లో మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది.
లేకపోతే గోదాముల్లో పడి ఉండిపోయే లేదా వ్యర్థంగా మారిపోయే వస్తువులు మళ్లీ ఎవరో ఒకరి చేతికి చేరుతున్నాయి. అంటే ఇది కేవలం వినోదం మాత్రమే కాదు. ఈ-కామర్స్ వ్యర్థాలను తగ్గించే ఒక కొత్త వ్యాపార నమూనా కూడా.
భారత్‌లో ఇలాంటి దుకాణాలు వస్తే?
ఒక్కసారి ఊహించండి. హైదరాబాద్‌లో…విజయవాడలో… విశాఖపట్నంలో…”రిటర్న్ అయిన Amazon పార్సిళ్లు – లోపల ఏముందో తెలియదు” అని ఒక షాప్ తెరిస్తే… మీరు వెళ్లి ఒక పార్సిల్ కొంటారా? లేదా… “రిస్క్ ఎందుకు?” అని బయటకు వచ్చేస్తారా? బహుశా సమాధానం చెప్పే ముందు… మీ చిన్నప్పటి జాతర మళ్లీ ఒక్కసారి గుర్తొచ్చి ఉండొచ్చు.
ప్రతీ తరం..కొత్త జాతర
ప్రతి తరం తనకంటూ ఒక జాతరను సృష్టించుకుంటుంది. మన ముందు తరం జాతరలో…ఒక రూపాయి పెట్టి అట్ట మీద పీకేవాళ్లం. ఈ – తరం జాతరలో…వందల రూపాయలు పెట్టి పార్సిల్ తెరుస్తోంది. ఆట మాత్రమే మారింది. గెలుపు-ఓటమి మాత్రమే మారింది. కానీ మనిషిలోని ఒక చిన్న పిల్లవాడు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాడు. “లోపల ఏముందో ఒకసారి చూసేద్దాం…” అదే ఆసక్తి… ఇప్పుడు యూరప్‌లో కోట్ల రూపాయల బిజినెస్‌గా మారిపోయింది.








