బాల్టిమోర్ ఆటా వేదికగా ‘మైల్స్టోన్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ’ పుస్తకావిష్కరణ!
అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలలో ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి రచించిన ‘మైల్స్టోన్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పురావస్తు , చరిత్ర రంగంలోని మైలురాయి వంటి విశేషాలను ఈ పుస్తకం వెలుగులోకి తెస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆటా సాహిత్య కమిటీ చైర్ వేణు నక్షత్రం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ డి. నరసింహారెడ్డి చేతుల మీదుగా సంయుక్తంగా జరిగింది. ఈ సందర్భంగా వేణు నక్షత్రం మాట్లాడుతూ.. సాధారణ చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చోటు దక్కని తెలంగాణ చరిత్ర, పురావస్తు శాస్త్రంలోని చారిత్రక అన్వేషణలను ఈ పుస్తకం సమగ్రంగా పొందుపరిచిందని కొనియాడారు.
గత 40 సంవత్సరాలుగా తెలంగాణ పురావస్తు , చారిత్రక రంగంలో డాక్టర్ శివనాగిరెడ్డి అందిస్తున్న విశేష సేవలను ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి రామసహాయం , శ్రీధర్ బానాల అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్య నాంపల్లి, రాజేశ్వర్ రావు టేక్మాల్, వెంకట్ కృష్ణారెడ్డి గుజ్జుల, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.








