ఆటా మహాసభల్లో ఆకట్టుకున్న అరుణా మిల్లర్ తెలుగు ప్రసంగం..
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలలో మేరీల్యాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ ప్రత్యేక అతిథిగా విచ్చేసి తెలుగులో ప్రసంగించారు. ఆమె ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె మహాసభలకు హాజరైన ప్రముఖులు, దాతలు, కళాకారులు , ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అతిథులందరికీ మేరీల్యాండ్ రాష్ట్రం తరఫున ఘన స్వాగతం పలికారు.
మేరీల్యాండ్ రాష్ట్ర గవర్నర్ వెస్ మూర్ (Wes Moore) జీవిత ప్రయాణాన్ని, ఆయన సాధించిన విజయాలను అరుణా మిల్లర్ వివరించారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో రోడ్ స్కాలర్‌గా ఎదిగి, అమెరికా సైన్యంలో సేవలు అందించిన వెస్ మూర్ నాయకత్వాన్ని కొనియాడారు. 2022 ఎన్నికల సమయంలో తామిద్దరం కలిసి పోటీ చేసినప్పుడు ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకుంటూ, అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మేరీల్యాండ్ గడ్డపై తెలుగు మూలాలు ఉన్న తొలి ఇమ్మిగ్రెంట్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా విజయం సాధించి చరిత్ర సృష్టించినట్టు తెలిపారు.
కేవలం చరిత్ర సృష్టించడం తమ ఉద్దేశం కాదని, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకురావడమే తమ అసలైన బాధ్యత అని పేర్కొన్నారు. నాయకత్వానికి అసలైన పరీక్ష వ్యక్తిగత విజయాలు కాదని, తోటి వారికి అవకాశాలు సృష్టించడం , వెనుకబడిన వారిని ముందుకు తీసుకువెళ్లడమేనని ఆమె ఉద్ఘాటించారు. ఈ అద్భుతమైన మహాసభల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.








