ఆటా మహాసభల్లో సత్కారం అందుకున్న ప్రముఖ వైద్యులు డాక్టర్ గురునాథ్ రెడ్డి!
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా ఘనంగా జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు , యూత్ కన్వెన్షన్లో ప్రముఖ వైద్యులు డాక్టర్ గురునాథ్ రెడ్డిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ వేదికపై సత్కారం అందుకున్న అనంతరం ఆయన సభికులనుద్దేశించి మాట్లాడారు.
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు , భారత్, అమెరికా నలుమూలల నుండి విచ్చేసిన ప్రతి ఒక్క ప్రతినిధికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి ఘన వేదికపై ప్రముఖుల సమక్షంలో ఈ సన్మానం అందుకోవడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. తన ఈ విజయానికి , ప్రయాణానికి కారణమైన తన రోగులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, తన జీవితంలో తనకు స్పూర్తినిచ్చిన ప్రతి ఒక్కరికి , కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు.








