ఆపరేషన్ సముద్ర మంథన్..!
పశ్చిమాసియా రణం తర్వాత ప్రపంచదేశాలన్నీ చమురు బాధితులుగా మారాయి. ముఖ్యంగా గల్ఫ్ నుంచి చమురు షిప్స్ రాకపోతే ప్రపంచం అల్లకల్లోలమవుతోంది.. దీంతో ఆయా దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు, విధానాలపై దృష్టి పెట్టాయి. గల్ఫ్ దేశాలు.. వినియోగదేశాలకు చమురును పంపడంపై ఫోకస్ పెడితే… మిగతా ప్రపంచం ఇంధనాల మార్పు, సమకూర్పుపై ఫోకస్ పెంచాయి.
ముడిచమురు, గ్యాస్ కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు మన దేశం, సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సముద్రగర్భంలో ఉన్న చమురు నిల్వలను వెలికితీసేందుకు, రూ.84,084 కోట్ల అంచనా వ్యయంతో ‘సముద్ర మంథన్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ పథకాని’కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో అత్యంత లోతున ఉన్న ప్రమాదకర ప్రాంతాల నుంచి చమురు, గ్యాస్ వెలికి తీసేందుకు తవ్వే బావులకు అయ్యే ఖర్చులో సగాన్ని లేదా గరిష్ఠంగా రూ.650 కోట్లను నేరుగా దేశ బడ్జెట్ ద్వారా ప్రభుత్వమే భరించనుంది.
2031 వరకు సముద్ర గర్భంలో దాదాపు 60 లోతైన, అతి లోతైన బావులు తవ్వడానికి రూ.43,200 కోట్లు కేటాయించారు. ఒక్కో బావికి రూ.650 కోట్లు కేటాయిస్తారు. ఆఫ్‌షోర్ ప్రాంతాల్లో సీస్మిక్, జియోలాజికల్ సర్వేలు నిర్వహించి, చమురు నిల్వలు ఉండే అవకాశాలను గుర్తించడానికి రూ.28,534 కోట్లు వెచ్చించనున్నారు. సముద్రంలో కనుగొన్న చమురు, గ్యాస్‌లను తీరానికి తరలించేందుకు గ్యాస్ పైప్లైన్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రూ.10,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆఫ్‌షోర్ రంగానికి అవసరమైన యంత్రాలు, సేవలను అందించే పారిశ్రామిక జోన్ల అభివృద్ధికి రూ.2,000 కోట్లు వినియోగిస్తారు.
గేమ్‌ఛేంజర్‌గా సముద్ర మంథన్
చమురు లభించకపోతే, పెట్టిన పెట్టుబడి వృథా అవుతుందనే భయంతో లోతైన ప్రాంతాల్లో చమురు బావుల తవ్వకానికి ప్రైవేట్ కంపెనీలు దూరంగా ఉంటున్నాయి. చమురు ఉందని తేలిన బావుల నుంచి వెలికి తీసేందుకు మాత్రమే పెట్టుబడులు పెడుతున్నాయి. అందువల్లే ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా, మన ప్రభుత్వమే బడ్జెట్ నిధుల ద్వారా ఈ రిస్క్ భరించనుంది. చిన్నమొత్తాల్లో చమురు నిల్వలున్నాయని తేలినా సద్వినియోగం చేసుకునేలా, ప్రభుత్వ సాయంతో ఉమ్మడి పైప్లైన్లు, ప్రాసెసింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. తద్వారా కంపెనీలకు మౌలిక సదుపాయాల వ్యయాలు భారీగా తగ్గుతాయి. గత 10 ఏళ్లలో మన దేశం ముడిచమురు అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటం 77% నుంచి 88 శాతానికి పెరిగింది. మన అవసరాల్లో గ్యాస్‌ను సగానికి పైగా దిగుమతి చేసుకుంటోంది. సముద్ర మంథన్ ద్వారా ఏడాదికి 10-15 మిలియన్ టన్నుల చమురు అదనపు ఉత్పత్తి సాధించి, దిగుమతులను 3-5% వరకు తగ్గించొచ్చని భావిస్తున్నారు.
1997 నుంచి భారత ప్రభుత్వం చమురు-గ్యాస్ విధానాన్ని సులభతరం చేస్తూ వస్తోంది. 2016లో తెచ్చిన హెల్ప్ (హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ), ఓఏఎల్‌పీ (ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ)లతో పాటు.. 2025 ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చిన ఆయిల్ ఫీల్డ్స్ సవరణ చట్టం ద్వారా పన్నులు, లీజులను సరళీకృతం చేశారు. ఈ సంస్కరణలకు కొనసాగింపుగా తాజాగా సముద్ర మంథన్ పథకాన్ని తీసుకొచ్చారు. మన దేశంలోని చమురు క్షేత్రాల్లోకి అంతర్జాతీయ ఇంధన దిగ్గజాలను ఆకర్షించి, ఇంధన భద్రతను సాధించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించనుంది.








