ఇరాన్ మెడ వంచేందుకు ట్రంప్ ప్రయత్నాలు.. సరికొత్త మార్గాలకై అన్వేషణ…!
పశ్చిమాసియాలో శాంతి కావాలి.. కానీ ఎలా సాధ్యం. ఎందుకంటే అమెరికా పెట్టిన షరతులను ఇరాన్ అంగీకరించడం లేదు.అయితే ఇరాన్ చర్చలు వద్దనడం లేదు.. కానీ.. ఆ షరతులకు వ్యతిరేకమంటోంది. దీంతో నయానో, భయానో దారికి తెద్దామంటే టెహ్రాన్ హైకమాండ్ రాజీ పడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టెహ్రాన్ టార్గెట్ చేసేందుకు సరికొత్త మార్గాలకోసం అధ్యక్షుడు ట్రంప్ అన్వేషిస్తున్నారు. ఇదే విషయమై తమ బలగాలకు ట్రంప్ ఈమెయిల్ పంపినట్లు తెలుస్తోంది.
ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చి, దాని అణు కార్యక్రమాలను నిలిపివేసేలా చేయడం కోసం వినూత్న, సంప్రదాయేతర సూచనలు ఇవ్వాలని ట్రంప్ తమ బలగాలను కోరినట్లు సమాచారం. దీంతో ఇప్పటి వరకు టెహ్రాన్‌పై దాడులకు వాషింగ్టన్ అమలు చేసిన వ్యూహాన్ని సెంట్రల్ కమాండ్ అధికారులు పునఃపరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు చేపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతవారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ జోక్యంతో భీకర దాడుల నుంచి ట్రంప్ వెనక్కి తగ్గారు. కాగా.. అధ్యక్షుడి హెచ్చరికల కంటే ముందే అమెరికా సెంట్రల్ కమాండ్ తమ బలగాలకు ఈ-మెయిల్ పంపించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ను తిరిగి చర్చలకు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా కొన్ని వారాలుగా నిరంతర వైమానిక దాడులు చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఒప్పందం కుదిరే సూచనలు కనిపించకపోవడంతో.. టెహ్రాన్‌ను శిక్షించడంపై అగ్రరాజ్యం ఇప్పుడు దృష్టి సారించినట్లు సమాచారం.
ఒప్పందంపై తుది నిర్ణయానికి రావడానికి ఇరాన్‌కు ‘చివరి అవకాశం’ ఇచ్చామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Trump) అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చేపట్టిన దాడులకంటే తీవ్రంగా ఇరాన్‌పై విరుచుకుపడడానికి తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ యుద్ధం ముగింపునకు దౌత్య మార్గాలు అనుసరించాలని ఇరాన్‌తో సహా సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ చేసిన అభ్యర్థనల మేరకు సైనిక దాడిని నిలిపివేశామన్నారు. ప్రస్తుతం ఇరుదేశాల ప్రతినిధుల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయన్నారు. ఈ అవకాశాన్ని వారు వినియోగించుకోకపోతే ఇక టెహ్రాన్‌ను వదిలే సమస్యే లేదన్నారు.








