ఎన్నారై కష్టాలపై పంచ్‌లతో నవ్వించిన నవీన్ పోలిశెట్టి
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు , యూత్ కన్వెన్షన్‌లో ప్రముఖ టాలీవుడ్ యువ నటుడు నవీన్ పోలిశెట్టి ప్రత్యేక అతిథిగా విచ్చేసి తనదైన శైలిలో సభికులను నవ్వుల్లో ముంచెత్తారు. స్టేజ్‌పైకి రాగానే తన ఉత్సాహంతో హాల్ మొత్తాన్ని హోరెత్తించిన ఆయన, అమెరికాలో నివసించే ప్రవాస తెలుగువారి (ఎన్నారైల) జీవనశైలి, వీసా కష్టాలు, గ్రీన్ కార్డ్ ఇబ్బందులపై వేసిన సరదా పంచ్‌లు అందరినీ కడుపుబ్బా నవ్విచాయి.
అమెరికాలో గ్రీన్ కార్డ్, హెచ్1బీ వీసాలు, ప్రయారిటీ డేట్ల కోసం పడే టెన్షన్లను నవీన్ పోలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్‌తో వివరించారు. తన సినిమాల విడుదల తేదీలు, ఎన్నారైల గ్రీన్ కార్డ్ ప్రయారిటీ డేట్లు ఒకేసారైనా త్వరగా రావాలని కోరుకుంటున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి తన సినిమాలన్నింటికీ అమెరికా ప్రీమియర్స్ ద్వారానే బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చిందని, ఇక్కడి ప్రేక్షకుల అభిమానమే తనను ఈ స్థాయికి తీసుకెళ్లాలని గుర్తుచేసుకున్నారు.
అమెరికాలో పిల్లల పెంపకం గురించి మాట్లాడుతూ, ఇక్కడ అందరూ థెరపీ గురించి మాట్లాడుతుంటారని, కానీ చిన్నప్పుడు ఇండియాలో మాకు అప్పట్లో ఉన్న ఏకైక థెరపీ ‘చెప్పు దెబ్బలే’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ నవ్వులు పూయించాయి. తన తదుపరి సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. చివరగా మెగాస్టార్ చిరంజీవి పాటకు సరదాగా లిరిక్స్ మార్చి అందరినీ అలరించారు.








