షరీఫ్ ప్రభుత్వం ఏక్షణాన్నైనా పతనం… పాక్ నేతల ఆందోళన..!
పాకిస్తాన్ లో ఇప్పుడు ఓ వింత ధోరణి మొదలైంది. దశాబ్దాలుగా భారత వ్యతిరేక విధానాలతో ముందుకెళ్లిన పాకిస్తాన్ పాలకులు , నేతలు.. ఇప్పుడు భారత్ తరహాలో తమ దేశం ఉండాలని కాంక్షిస్తున్నారు. అది కూడా పబ్లిగ్గా.. పలు వేదికలు , సమావేశాల్లో ఇదే మాటను వినిపిస్తున్నారు. ఎందుకిలా.. పాక్ నేతలకు ఏమైంది..? అంతలో ఇంత మార్పెందుకు కనిపిస్తోంది అంటే.. అది పాక్ లోని యువత మనసులోని మాట కాబట్టి..
పాకిస్తాన్లో పైకి ప్రజాస్వామ్యం ఉన్నట్లు కనిపిస్తున్నా పెత్తనం సైన్యానిదే. ఇటీవలే అక్కడి పాలకులపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సోదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీని చూసి నేర్చుకోవాలని చురకలు అంటించారు. తాజాగా ఇక పాక్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ సొంత ప్రభుత్వంపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన పాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, ఇక ఇలాగే కొనసాగితే మరో పదేళ్ల తర్వాత కూడా అదే సమస్యలు మిగులుతాయని స్పష్టంగా చెప్పారు.
నఖ్వీ ఈ వ్యాఖ్యలను సాధారణంగా చేయలేదు. దేశ ఆర్థిక సదస్సులో మాట్లాడుతూ ఆయన ప్రస్తుత పాలనా నమూనా దశాబ్దాలుగా విఫలమైందని, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం లేదని అన్నారు. కొత్త పరిపాలనా విభాగాలు, ప్రావిన్సులు ఏర్పాటు చేయాలని, రాజకీయ పక్షాలన్నీ కలిసి మాట్లాడాలని సూచించారు. ఇలాంటి మాటలు ప్రభుత్వంలోని కీలక మంత్రి నుంచి రావడం అసాధారణం. ఇది అంతర్గత అసంతృప్తిని, లేదా సంస్కరణల అవసరాన్ని ప్రజల ముందు ఉంచాలనే ప్రయత్నంగా కనిపిస్తోంది.
నఖ్వీ మరో ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు. యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, అవకాశాల కొరత వల్ల అసంతృప్తి పెరుగుతోందని, వారు ఐక్యమైతే పరిస్థితిని తారుమారు చేయగలరని హెచ్చరించారు. ఈ మాటలు శ్రీలంకలో 2022లో జరిగిన ఆర్థిక సంక్షోభం, ప్రజా ఉద్యమం, లేదా నేపాల్‌లో గతంలో చూసిన యువత నేతృత్వంలోని నిరసనలను గుర్తుకు తెస్తున్నాయన్నారు. అక్కడ కూడా ఆర్థిక సమస్యలు, అవినీతి, పాలనా వైఫల్యాలు ప్రజలను వీధుల్లోకి దింపాయని గుర్తు చేశారు. పాకిస్తాన్లో రుణ భారం పెరుగుతూ, ఆర్థిక సంక్షోభం కొనసాగుతూ ఉంటే యువతలోని ఆగ్రహం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. .
నఖ్వీ వ్యాఖ్యలు ప్రభుత్వ పతనానికి సూచనగా విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం, రాజకీయ పక్షాలు, ఆర్థిక సంస్థల పాత్ర క్లిష్టంగా ఉంటుంది. ఒక మంత్రి విమర్శలు చేసినంత మాత్రాన వ్యవస్థ పూర్తిగా కూలిపోదు. అయితే ఇవి లోపాలను బహిరంగంగా అంగీకరించడంతో పాలకులపై ప్రజల్లో నమ్మకం మరింత తగ్గే ప్రమాదం ఉంది. సంస్కరణలు, కొత్త పరిపాలనా నిర్మాణాలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి చర్యలు తీసుకుంటే పరిస్థితి మెరుగవచ్చు. లేకపోతే అసంతృప్తి పెరిగి నిరసనలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. నఖ్వీ మాటలు ఒక హెచ్చరికగా తీసుకుని చర్యలు చేపట్టడం మంచిది.








