ఐమ్యాక్స్ ఎందుకు? వారణాసి స్కేల్ గురించి రాజమౌళి షాకింగ్ రివీల్!
దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) రూపొందిస్తున్న వారణాసి(varanasi) ఇండియన్ సినీ హిస్టరీలో మరో టెక్నికల్ మైల్‌స్టోన్‌గా నిలిచే దిశగా ముందుకు సాగుతోంది. ఈ సినిమాలో 1.43:1 ఐమ్యాక్స్ ఫ్రేమ్‌లో రూపొందించిన సీన్స్ ఉండనున్నాయని ప్రకటించడంతో ప్రాజెక్ట్‌పై ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఆసక్తి పెరిగింది. ఇది కేవలం భారీ బడ్జెట్ సినిమా మాత్రమే కాకుండా, ప్రేక్షకులు థియేటర్లో అనుభవించే విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌ను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లాలనే ప్రయత్నంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియన్ మూవీస్‌లో ఇప్పటివరకు అరుదుగా కనిపించిన ఐమ్యాక్స్ ప్రెజెంటేషన్‌ను ఈ సినిమా మరింత విస్తృత స్థాయిలో ఉపయోగించనుంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ డెసిషన్ వెనుక ఉన్న ఆలోచనను వివరించారు. ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను ఎంచుకోవడం ప్రమోషన్స్ కోసం కాదని, కథలోని ప్రపంచాల పరిమాణమే అందుకు కారణమని ఆయన స్పష్టం చేశారు. సినిమాలోని కొన్ని లొకేషన్లు, నిర్మాణాలు, యుద్ధ సన్నివేశాలు సాధారణ తెరపై చూపితే వాటి అసలు ప్రభావం తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అంటార్కిటికా నేపథ్యంలో కనిపించే వందల అడుగుల ఎత్తైన మంచు నిర్మాణాలు, ప్రాచీన రోమ్ సైన్యాల స్థాయిలో రూపొందించిన భారీ యుద్ధ దృశ్యాలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు.
ఈ తరహా విజువల్స్‌కు అవసరమైన ఎత్తు, లోతు, విస్తృతతను పూర్తిగా అందించగల మాధ్యమం ఐమ్యాక్స్(imax) అని రాజమౌళి అభిప్రాయపడ్డారు. ఆడియన్ స్క్రీన్ ను చూస్తున్న అనుభూతి కాకుండా, ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టిన భావన కలగాలనే టార్గెట్ తో ఈ ఫార్మాట్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కథ చెప్పే విధానాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో మిళితం చేయడంలో రాజమౌళి ఎప్పుడూ ప్రత్యేక దృష్టి పెడతారు. వారణాసి విషయంలో కూడా అదే దృక్పథం మరింత పెద్ద స్థాయిలో కనిపిస్తోందని, ఈ సినిమా ఇండియన్ సినిమాకు కొత్త ప్రమాణాలను సృష్టించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.








