చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే..?
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(ysrcp), తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య రాజకీయ విభేదాలు మరోసారి ఘర్షణకు దారితీశాయి. చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన స్థానిక టీడీపీలో యాక్టివ్ గా ఉండే.. కార్యకర్త శేఖర్ యాదవ్‌పై వైసీపీ ఎమ్మెల్యే వై. విరూపాక్షి మరియు ఆయన వర్గీయులు అత్యంత దారుణంగా దాడికి తెగబడ్డారు. పాత కక్షలు, రాజకీయ విబేధాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత గల ప్రజాప్రతినిధే స్వయంగా ఇలాంటి దాడులకు దిగడంపై స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది.
ఈ ఘోర దాడిలో తీవ్రంగా గాయపడిన శేఖర్ యాదవ్‌ను స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన తల, ఒంటిపై బలమైన గాయాలు కావడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం, బాధితుడికి మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్యుల సూచన మేరకు కర్ణాటకలోని బళ్లారి ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బళ్లారి వైద్యుల పర్యవేక్షణలో శేఖర్ యాదవ్‌కు అత్యవసర విభాగంలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ప్రాణాపాయం నుండి ఇంకా కోలుకోలేదని వైద్య వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ఈ దాడి ఘటనపై తెలుగుదేశం పార్టీ(tdp) శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార మదంతో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై మరియు ఆయన అనుచరులపై పోలీసులు తక్షణమే హత్యాయత్నం కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో సంగాల గ్రామంలో మరియు చిప్పగిరి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.








