తెలుగు సంస్కృతిని ఏకం చేస్తున్నారు: అనన్య నాగళ్ల
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా ఘనంగా జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలలో ప్రముఖ టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల ప్రత్యేక అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ వేడుకలలో పాల్గొనడం పట్ల ఆమె తన ఆనందాన్ని, ఉత్సాహాన్ని పంచుకున్నారు.
తాను తెలంగాణకు చెందిన తెలుగు అమ్మాయినని, పొట్టేల్, వకీల్ సాబ్ వంటి పలు సినిమాల్లో నటించానని, గత సంవత్సరంలో ఉత్తమ నటిగా ‘గద్దర్’ అవార్డును కూడా గెలుచుకున్నానని అనన్య నాగళ్ల సభికులకు తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆటా కన్వెన్షన్ గురించి ఇంతకుముందు ఎంతో విన్నానని, అయితే ఇక్కడికి వచ్చాక ఇంతమంది తెలుగువారిని, ఈ స్థాయి గ్రాండ్ ఈవెంట్‌ను చూశాక తనకు ఎంతో ఆశ్చర్యమనిపించిందని తెలిపారు.
ఇండియాలో కూడా ఇంత పెద్ద ఈవెంట్‌ను ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయడం కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. చిన్న పిల్లల ప్రదర్శనలు, సాహిత్య వేదికలు, సీనియర్ సిటిజన్ల కోసం నిర్వహించిన కార్యక్రమాలను తాను స్వయంగా చూశానని, అమెరికాలో ఉన్నప్పటికీ మన పిల్లలు మన కల్చర్ , ట్రెడిషన్‌ను ఎంతో బాగా నేర్చుకుంటున్నారని కొనియాడారు. ఇలా రకరకాల కార్యక్రమాలతో తెలుగు సంస్కృతిని ఏకం చేస్తున్నారని అనన్య పేర్కొన్నారు.








