2028లో ఆటా మహాసభలు జరిగేది అక్కడే: సతీష్ రెడ్డి
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా ముగిసిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలలో ఆటా ప్రెసిడెంట్-ఎలెక్ట్ సతీష్ రెడ్డి సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆటా అనేది మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన గొప్ప సంస్థ అని, కేవలం 100 మందితో ప్రారంభమైన ఈ సంస్థ ఇవాళ వేల మంది సభ్యులతో మహా వృక్షంలా ఎదిగిందని సతీష్ రెడ్డి గుర్తుచేశారు. భాష, సంస్కృతి , సేవ అనే మూడు ప్రధాన అంశాలపై ఆటా నిలబడిందని, గత 36 సంవత్సరాలుగా మన భాషా సంస్కృతులను భావితరాలకు అందించడానికి ఆటా ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు.
అమెరికాలో ఉన్నప్పటికీ పుట్టిన గడ్డను మరువకుండా తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలు, పాఠశాలలు, తాగునీటి సమస్యలు , ఆరోగ్య రంగాలలో రెండేళ్లకు ఒకసారి ఆటా ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే అమెరికాలో స్థానిక కమ్యూనిటీ కోసం కూడా అనేక సేవా కార్యక్రమాలను ముందు ముందు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.
గత రెండేళ్ల విజయాలు…
గడచిన రెండేళ్లుగా ప్రస్తుత అధ్యక్షుడు జయంత్ చల్లా ఆధ్వర్యంలో సుమారు 150కి పైగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. అమెరికాలో దాదాపు 17 లక్షల మంది తెలుగువారు ఉన్నారని, ప్రత్యేకించి గత పదేళ్లలో ఇక్కడికి వస్తున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఏ చిన్న సమస్య వచ్చినా ఆటా ఎప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
తనను ప్రెసిడెంట్-ఎలెక్ట్గా ఎన్నుకున్న ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ, పూర్వ అధ్యక్షులు చూపిన మార్గంలో నడుస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త కార్యక్రమాలను చేపడతామని వెల్లడించారు. ఈ మహాసభల విజయవంతం కోసం అంకితభావంతో శ్రమించిన కాన్ఫరెన్స్ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. చివరిగా, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తదుపరి ‘ఆటా’ మహాసభలు 2028 సంవత్సరంలో డల్లాస్ నగరంలో నిర్వహించనున్నట్లు సతీష్ రెడ్డి ఈ వేదికపై అధికారికంగా ప్రకటించారు.








