పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రభుత్వ విధానాలు.. ఆటా సభల్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
అమెరికాలోని బాల్టిమోర్‌లో 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రపంచ నలుమూలల నుండి విచ్చేసిన తెలుగు వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన నమస్కారాలు తెలియజేశారు. ఆటా నిర్వాహకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, సహచర మంత్రులను ఈ మహాసభలకు ఆహ్వానించినప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి తాము ఇక్కడికి వచ్చామని ఆయన తెలిపారు. వేల కిలోమీటర్లు దాటి విదేశాలకు వెళ్లినప్పటికీ, మన మూలాలను మర్చిపోకుండా, తాము సాధించిన ప్రగతిని , నైపుణ్యాన్ని సమాజంతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులన్నింటినీ సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తోందని భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణను కేవలం భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా, ప్రపంచంలోని అత్యున్నతంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని మూసీ నదిని సుమారు 56 కిలోమీటర్ల పొడవునా ప్రక్షాళన చేసి, రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేసే బృహత్ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు తెలిపారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్‌ను అనుసంధానిస్తూ రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్), 36 రేడియల్ రోడ్లను ప్లాన్ చేశామని, హైదరాబాద్‌ను ఆనుకుని ఒక సరికొత్త ‘ఫ్యూచర్ సిటీ’ని నిర్మించబోతున్నామని వివరించారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మానవ వనరులను మెరుగుపరచడం ఎంతో ముఖ్యమని, అందుకోసం విద్యారంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 100 శాసనసభ నియోజకవర్గాలలో ఒక్కో పాఠశాలను రూ. 200 కోట్ల వ్యయంతో 25 ఎకరాల క్యాంపస్‌లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ పేరుతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పేద పిల్లలే నేడు అమెరికా దాకా వచ్చి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల రంగాలలో విప్లవాత్మక మార్పులు తెస్తూ, ఇటీవల గ్లోబల్ సమ్మిట్‌ను కూడా నిర్వహించామని గుర్తుచేశారు.
అమెరికాలో స్థిరపడిన పారిశ్రామికవేత్తలు , ఎన్నారైలు తెలంగాణకు వచ్చి పరిశ్రమలను స్థాపించాలని, మేధస్సును రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ఎవరికైనా సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులు సులభంగా లభించేలా ప్రభుత్వపరంగా అన్ని వ్యవస్థలను సిద్ధం చేశామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ ప్రయాణంలో ఎన్నారైలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎన్నారైల సమస్యలను పరిష్కరించడానికి చట్టపరమైన రక్షణతో కూడిన ఒక ప్రత్యేక వ్యవస్థను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, ఓటర్ల నమోదు కోసం ప్రభుత్వం కల్పించిన ఆన్లైన్ వెబ్సైట్ సదుపాయాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ తమ ఓట్లను నమోదు చేసుకోవాలని కోరుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.








