ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ.. ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలని భట్టి పిలుపు!
అమెరికా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) ప్రతినిధుల సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో సంక్షేమం , అభివృద్ధిని జోడెద్దులలా సమానంగా ముందుకు తీసుకువెళ్తూ, తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విదేశీ ప్రతినిధులు , ఎన్ఆర్ఐ ల సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పలు సంస్కరణలు, భవిష్యత్ ప్రణాళికలను ఆయన విశదీకరించారు.
తెలంగాణ రైజింగ్ 2047 – ప్రత్యేక ప్రణాళికలు
రాష్ట్రంలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణంతో పాటు రాబోయే రోజుల్లో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్ 2047’ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ప్రతి నియోజకవర్గంలోనూ అత్యాధునిక వసతులతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అంతేకాకుండా, దేశంలోనే ప్రథమంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం పూట పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు , చెరువుల పరిరక్షణ, కబ్జాలకు అడ్డుకట్ట వేయడం కోసం ‘హైడ్రా’ (HYDRAA) వ్యవస్థను తీసుకువచ్చి పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
గత పాలనపై విమర్శలు…
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర విధ్వంసానికి గురైందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని భట్టి విక్రమార్క విమర్శించారు. ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా 15 నుంచి 25 తేదీల వరకు కూడా జీతాలు అందని దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను పాటించి వ్యవస్థను గాడిలో పెట్టామని, ఇప్పుడు ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఎన్ఆర్ఐలకు స్వరాష్ట్రంలో పెట్టుబడుల ఆహ్వానం
అమెరికాలో స్థిరపడిన తెలుగు ఎన్ఆర్ఐలు , పారిశ్రామికవేత్తలు మాతృభూమిపై మక్కువతో తెలంగాణ అభివృద్ధి , పునర్నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వపరంగా సింగిల్ విండో విధానం ద్వారా అన్ని రకాల సహకారాలను అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, శాసనసభ్యులు రామ్మోహన్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి, కాలే యాదయ్య, దొంతి మాధవరెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, అలాగే ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








