జగన్ టూర్ ఎఫెక్ట్.. మాజీ ఎమ్మెల్యేకి పోలీసుల షాక్..!
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు వరుస కేసులు నమోదు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. జులై 30వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదం కేసులో అరెస్ట్ అయి శ్రీకాకుళం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ ఈ పర్యటన చేపట్టారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) భోగాపురం పర్యటన ఉన్న నేపథ్యంలో, శాంతిభద్రతల దృష్ట్యా జగన్ పర్యటనకు పోలీసులు కేవలం ములాఖత్‌కు మాత్రమే పరిమితం చేస్తూ కఠినమైన ఆంక్షలు, షరతులు విధించారు.
ఈ నేపథ్యంలో, నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ (Gorle Kiran Kumar) తో పాటు మరో 16 మంది ముఖ్యమైన వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జులై 30 నాటి జగన్ పర్యటన సందర్భంగా అనుమతులకు విరుద్ధంగా జాతీయ రహదారిపై భారీగా జనసమీకరణ చేయడం, నిబంధనలు దాటి ర్యాలీలు నిర్వహించడంపై పోలీసు యంత్రాంగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంక్షలను తుంగలో తొక్కి రోడ్లపై హంగామా సృష్టించడమే కాకుండా, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించారంటూ జె.ఆర్.పురం మరియు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి.
పర్యటన ఆసాంతం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ, రక్షణ వలయాన్ని దాటి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ శ్రేణుల తీరుపై స్థానిక పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని ఇబ్బంది పెట్టడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా గుంపులుగా చేరడం వంటి అంశాలను ఎఫ్ఐఆర్లో ప్రస్తావించినట్లు సమాచారం. ప్రభుత్వం కావాలనే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా, చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఊపేక్షించేది లేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.








