డీల్ కుదుర్చుకుంటారా.. లొంగిపోతారా..? ఇరాన్ కు ట్రంప్ అల్టిమేటం..!
పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఆదేశ నాయకులు చర్చలు కావాలని తమను కోరుతున్నారని.. అయితే బయటకు మాత్రం నిరాకరిస్తున్నట్లు చెబుతున్నారన్నారు. ఇలాంటి వాటిని తాను సహించనన్నారు ట్రంప్. ఇరాన్ (Iran) తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని లేదా పూర్తిగా లొంగిపోవాలని ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. దీనికి గానూ ఇరాన్ కు ట్రంప్ 48 గంటల డెడ్ లైన్ విధించారు.
హర్మూజ్‌ను తామే నిర్వహిస్తున్నామని ఇరాన్ నేతలు చెబుతున్నారని ట్రంప్ అసహనం వ్యక్తంచేశారు. ఆ జలసంధి పూర్తిగా అమెరికా నియంత్రణలో ఉంది. మేము కోరుకుంటే తప్ప ఇరాన్‌కు ఏదీ చేరదు. ఆ దేశం వద్ద ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు’’ అని ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశానన్న ట్రంప్.. గల్ఫ్‌లోని మిత్రదేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ విజ్ఞప్తి మేరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. ఆయా దేశాల ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత ఇరాన్‌తో దౌత్యానికి మరింత అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఒప్పందం ఖరారు కాకపోతే మళ్లీ దాడులకు దిగుతామని హెచ్చరించారు. కాగా, ఇరాన్ విదేశాంగశాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ.. ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. వాషింగ్టన్‌తో చర్చలు జరపడం లేదని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఏకైక చర్చలు జలసంధికి అవతలి వైపున ఉన్న ఒమన్‌తో మాత్రమేనని చెప్పారు. అది కూడా హర్మూజ్ గుండా తాత్కాలిక సురక్షిత నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేయడం వరకేనని స్పష్టం చేశారు.








