లక్షల కోట్ల AIని ఉచితంగా ఇచ్చేస్తున్న అలీబాబా!? వెనుక ఉన్న అసలు ‘మాస్టర్ ప్లాన్’ ఇదే!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి… వేలాది ఇంజినీర్లతో ఏళ్ల తరబడి శ్రమించి తయారు చేసిన AIని… “మీరు కూడా వాడుకోండి” అంటూ ప్రపంచం ముందు పెట్టడానికి ఏ కంపెనీ అయినా సిద్ధపడుతుందా?
సాధారణంగా కాదు.
అలాంటి టెక్నాలజీని తాళం వేసి దాచుకోవడానికే కంపెనీలు ఇష్టపడతాయి. ఎందుకంటే అదే వారి బంగారు గుడ్లు పెట్టే బాతు. కానీ చైనా టెక్ దిగ్గజం Alibaba మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుంది. తన అత్యంత శక్తివంతమైన AI మోడల్ Qwen3.8-Maxకు సంబంధించిన Open Weightsను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
మొదట చూస్తే ఇదో పిచ్చి నిర్ణయంలా అనిపించొచ్చు. “ఇంత విలువైన AIని బయటకు ఎందుకు ఇస్తున్నారు?” ఇప్పుడు ప్రపంచ టెక్ రంగంలో తిరుగుతున్న ప్రశ్న ఇదే. కానీ… ఈ ప్రశ్నకు సమాధానం AI తయారీలో లేదు. బిజినెస్‌లో ఉంది. బిజినెస్ ప్రపంచంలో ‘ఉచితం’ అనే పదానికి వెనుక ఎప్పుడూ ఒక పక్కా వ్యూహం ఉంటుంది. Alibaba విషయంలోనూ అదే జరుగుతోంది.
అసలు ఆట ఎక్కడ ఉందంటే…
మనలో చాలామంది ఏమనుకుంటారంటే—AI కంపెనీలు అంటే తమ మోడల్‌ను అమ్మి డబ్బులు చేసుకుంటాయని. నిజానికి అది అసలు కథలో ఒక చిన్న భాగం మాత్రమే. వ్యాపార ప్రపంచంలో అసలు గెలుపు దేనిమీద ఆధారపడి ఉంటుందో తెలుసా? మీ టెక్నాలజీని ఎంతమంది డెవలపర్లు వాడుతున్నారు? మీ మోడల్‌నే నమ్ముకుని ఎన్ని వేల స్టార్టప్‌లు తమ యాప్‌లను నిర్మిస్తున్నాయి? ఎంతమంది మీ నియంత్రణలో ఉన్న వ్యవస్థ (Ecosystem) లోకి అడుగుపెడుతున్నారు? ఇక్కడే అసలు గేమ్ దాగుంది. మంచి మోడల్ తయారు చేయడం ఒక ఎత్తైతే…దాన్ని అడ్డం పెట్టి అందరూ తమ చుట్టూ తిరిగేలా ఒక వాతావరణాన్ని సృష్టించడం మరో ఎత్తు.అందుకు రకరకాల వ్యూహాలు ప్రపంచం మీదకు వదలాలి. అలాంటిదే ఇదీను.
AI కంపెనీలు సాధారణంగా ఏం చేస్తాయి?
మీరు రూ.10,000 పెట్టి ఒక వస్తువు తయారు చేస్తే… దాన్ని ఎవరికి పడితే వాళ్లకు ఇవ్వరు. అలాంటిది బిలియన్ల డాలర్లు పెట్టి తయారు చేసిన AIని ఎందుకు ఉచితంగా ఎవరు ఇస్తారు?. అందుకే OpenAI, Google, Anthropic వంటి కంపెనీలు తమ అత్యంత శక్తివంతమైన AI మోడళ్లను ఎక్కువగా తమ సర్వర్లలోనే ఉంచుతాయి. మీరు వాటిని ఉపయోగించవచ్చు. కానీ వాటిని మీ సొంత సిస్టమ్‌లో నడపడం, మీ కంపెనీ అవసరాలకు తగ్గట్టు మార్చుకోవడం, వాటిపై కొత్త ఉత్పత్తులు నిర్మించడం చాలా పరిమితంగానే ఉంటుంది. దీనికి ఒకే కారణం. నియంత్రణ.
అంటే AI ఎవరి చేతిలో ఉంటే… భవిష్యత్తు మార్కెట్ కూడా ఎక్కువగా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు పెద్ద కంపెనీల వ్యూహం ఒకటే. AIని బయటకు ఇవ్వొద్దు… వినియోగదారులను మన దగ్గరకు రప్పించు. అయితే Alibaba మాత్రం ఈ ఫార్ములాను బ్రేక్ చేయాలని చూస్తోంది.
ఎందుకు? Alibaba ఏం విడుదల చేసింది?
Alibaba ప్రకటించిన Qwen3.8-Max కంపెనీ ఇప్పటి వరకు రూపొందించిన అత్యంత శక్తివంతమైన AI మోడల్. దీనిలో మొత్తం 2.4 ట్రిలియన్ పారామీటర్లు ఉన్నాయి. అయితే ప్రతి ప్రశ్నకు అవన్నీ పనిచేయవు. అవసరమైన భాగాన్ని మాత్రమే ఉపయోగించే Mixture of Experts (MoE) నిర్మాణం వల్ల కంప్యూటింగ్ ఖర్చు తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. ఇది ఒకేసారి 10 లక్షల టోకెన్ల సమాచారాన్ని గుర్తుంచుకుని విశ్లేషించగలదని కూడా ప్రకటించింది. అవన్నీ రొటీనే. అన్నిటి కంటే ఎక్కువ చర్చకు కారణమైన విషయం వేరేది. అదే Open Weights.
Open Weights… అసలు ఇది ఏమిటి?
ఈ పదం విన్న వెంటనే చాలామంది… “అంటే పూర్తిగా ఉచితమా?” అని అనుకుంటున్నారు.అది పూర్తి నిజం కాదు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి చాలా ఏళ్ళపాటు చదివి, అనుభవం సంపాదించి అతను మంచి డాక్టర్ అయ్యాడు. అతని మెదడులో ఉన్న జ్ఞానమే అతని అసలు సంపద అని అందరం ఒప్పుకుంటాం. AIలో కూడా అదే. కోట్లాది డేటాతో శిక్షణ ఇచ్చిన తర్వాత AI నేర్చుకున్న జ్ఞానాన్నే Weights అంటారు.
Alibaba ఇప్పుడు ఆ “నేర్చుకున్న మెదడును” డెవలపర్లకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. అంటే దీన్ని వాడుకునే వారు… మొదటి నుంచి తమ AIకి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ట్రెయిన్ చేసిన మోడల్‌ను డౌన్లోడ్ చేసుకుని, లైసెన్స్ అనుమతించే మేరకు తమ అవసరాలకు తగ్గట్టు ఉపయోగించుకోవచ్చు.
అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. చాలా మంది పొరబడేది. Open Weights అంటే Open Source కాదు. ఇల్లు కట్టి తాళాలు ఇవ్వడం Open Weights అయితే… ఆ ఇంటి పూర్తి బ్లూప్రింట్, ఎలా కట్టారో చెప్పే మ్యాప్ కూడా ఇవ్వడం Open Source. ఇక్కడ Alibaba ఇస్తోంది తాళాలు. ఇంటి నిర్మాణ రహస్యాలన్నీ కాదు.
ఇందులో Alibabaకి లాభమేంటి?
ఇక్కడే అసలు బిజినెస్ కథ మొదలవుతుంది. చాలామంది నమ్మేది…AIని అమ్మి కంపెనీలు డబ్బు సంపాదిస్తాయని. కానీ టెక్ ప్రపంచంలో పెద్ద కంపెనీలు చాలాకాలం క్రితమే ఇంకో సీక్రెట్ ని అర్దం చేసుకున్నాయి. ఉత్పత్తిని అమ్మడం కంటే… ఎకోసిస్టమ్‌ను నిర్మించడం ఎక్కువ లాభం. ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది డెవలపర్లు Alibaba AIతో యాప్‌లు తయారు చేయడం మొదలుపెడితే… వాళ్లకు క్లౌడ్ కావాలి. GPUలు కావాలి. APIలు కావాలి. ఎంటర్ప్రైజ్ సేవలు కావాలి. భారీ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు కావాలి. అక్కడే అసలు వ్యాపారం మొదలవుతుంది. అంటే AI మోడల్ ఒక ఉత్పత్తి కాదు. కొత్త కస్టమర్లను తీసుకొచ్చే తలుపు. ఇదే ఆట Google కూడా ఆడింది
ఇదంతా ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా?
అవును. ఒకప్పుడు Google కూడా Androidను ప్రపంచానికి ఉచితంగా అందించింది. అప్పుడు చాలామంది ఒకే ప్రశ్న అడిగారు. “ఇందులో Googleకి లాభమేంటి?” సమాధానం కొన్ని సంవత్సరాల తర్వాత కనిపించింది. Android ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దాంతో కోట్లాది మంది Google Search వాడారు. Play Store వాడారు. Google Maps వాడారు. Google Cloud వాడారు. Androidను అమ్మి కాదు… Android చుట్టూ ఏర్పడిన ప్రపంచం ద్వారా Google భారీ వ్యాపారాన్ని నిర్మించింది.ఇప్పుడు Alibaba కూడా అదే గేమ్‌ను AI ప్రపంచంలో ఆడుతోందనే అనిపిస్తోంది.
గెలిచేది AI కాదు… అలవాటు
సాధారణంగా మనుషులు ఒక ప్లాట్‌ఫామ్‌కు అలవాటు పడితే… దాన్ని మార్చడం అంత సులభం కాదు. మీరు ఒక AIతో మీ కంపెనీ మొత్తం పనిచేసేలా డిజైన్ చేసుకున్నాక… మరో AIకి మారడం ఖర్చుతో కూడుకున్న పని. Alibabaకి కూడా అదే తెలుసు. అందుకే…ముందు డెవలపర్లను గెలుచుకో.తర్వాత మార్కెట్‌ను గెలుచుకో. ఇదే ఈ వ్యూహం.
మరి మనకు ఉపయోగం ఏమిటి?
“Alibaba AI విడుదల చేస్తే… నాకు ఏమొస్తుంది?” సహజంగానే వచ్చే ప్రశ్న ఇది. ఒక్క రోజులో ఏమీ మారదు. అయితే ఇలాంటి పోటీ పెరిగితే…AI సేవల ధరలు తగ్గే అవకాశం ఉంది. మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారతీయ స్టార్టప్‌లు కూడా తెలుగు సహా స్థానిక భాషల్లో కొత్త AI సేవలను వేగంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. రైతు తన పంట ఫొటో తీసి సమస్య అడిగినా…చిన్న వ్యాపారి తన షాప్‌కు పోస్టర్ తయారు చేయించుకున్నా…విద్యార్థి క్లిష్టమైన పాఠాన్ని తెలుగులో అర్థం చేసుకోవాలని అనుకున్నా… ఇలాంటి సేవలు మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి ఈ పోటీ ఉపయోగపడవచ్చు.
ఏదైమైనా
Alibaba విడుదల చేసింది మరో AI మోడల్ మాత్రమే కాదు. ఒక కొత్త వ్యాపార ఆలోచనను. AI ప్రపంచంలో గెలిచేది అత్యంత తెలివైన మోడల్ మాత్రమే కాదు. అత్యధిక మంది డెవలపర్లను, కంపెనీలను, వినియోగదారులను తన చుట్టూ తిప్పుకోగలిగిన కంపెనీ. అందుకే Alibaba తాజా నిర్ణయాన్ని కొందరు AI విడుదలగా చూడటం లేదు. రేపటి AI మార్కెట్‌ను తన వైపు తిప్పుకునే తొలి ఎత్తుగా చూస్తున్నారు. ఈ ఎత్తు ఫలిస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. Alibaba AIని బయటకు తీసుకురావడం దాతృత్వం కాదు. భవిష్యత్తు మార్కెట్‌ను గెలవడానికి వేసిన పెట్టుబడి.








