సిద్దరామయ్య మాటను విన్నట్లే విని.. తన పని తాను చేసుకుపోయిన సీఎం
కర్నాటక కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. మంత్రివర్గ విస్తరణలో తమకు స్థానం దక్కలేదని నేతలు అలగడం అత్యంత సహజమే కానీ.. మాజీ సీఎం సిద్దరామయ్య, సీఎం శివ కుమార్ ని కూర్చోబెట్టి, మాట్లాడిన తర్వాతే అధిష్ఠానం విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అందరూ అనుకున్నట్లు సీఎం డీకే శివకుమార్ మాజీ సీఎం సిద్దరామయ్య ప్రతిపాదనలను విన్నట్లే విని.. తన పని తాను చేసుకున్నట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు.
మాజీ సీఎం సిద్దరామయ్య సైతం మంత్రివర్గ కూర్పుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు మాటమాత్రం చెప్పకుండానే తన సామాజక వర్గానికి(కురుబ) చెందిన మహిళా నేత గాయత్రిని మంత్రివర్గం జాబితాలో చేర్చడంపై ఆయన నిప్పులు చెరిగారు. ఓబీసీ, ప్రత్యేకించి తన సొంత(కురుబ) సామాజికవర్గానికి చెందిన ఆమెను ఎంపిక చేసేప్పుడు కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు.చివరికి పరిస్థితి తీవ్రం అవుతోందని గ్రహించిన సీఎం డీకే.. ఆమె పేరును చివరి నిమిషంలో తొలగించేశారు.
మరో వైపు కొందరు ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కూడా మంత్రివర్గ విస్తరణపై తీవ్ర అసంతృప్తితో వున్నారు. ఈ క్రమంలో ఇండి నియోజకవర్గం ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయగా.. శివమొగ్గ జిల్లా సాగర ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ మంగళవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు.
మరోవైపు.. పలు జిల్లాల్లో అసంతృప్త ఎమ్మెల్యేలు నిరసనలతో హోరెత్తించారు. బెళగావిలో లక్ష్మీ హెబ్బాళ్కర్ అనుచరులు పుణె-బెంగళూరు జాతీయ రహదారి టోల్ వద్ద రెండు గంటలపాటు ఆందోళన చేశారు. మైసూరులో తన్వీర్సేఠ్కు అవకాశం దక్కకపోవడంతో బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రె్సవేపై ఆందోళన చేశారు. ఇదే సమయంలో తబ్రేజ్ అనే అనుచరుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
చివరికి 19 మందితో కేబినెట్ విస్తరణ పూర్తి…
సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే డీకే శివకుమార్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. కేబినెట్ లో 19మందికి చోటు కల్పించారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. నరేంద్ర స్వామి, శివరాజ్ తంగదగి, రుద్రప్ప లమానీ, బసవంతప్ప, నాగేంద్ర, రఘుమూర్తి, జమీర్ అహ్మద్ రిజ్వాన్, అజయ్ సింగ్, మల్లికార్జున, బసవరాజు రాయరెడ్డి, విజయానంద కాశప్పనవర్, లక్ష్మణ సవధి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.








