ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా సరికొత్త డీజిల్..!
యుద్ధతంత్రంలో భాగంగా భారత్ తన సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. దీనిలో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. అత్యంత శీతల, మంచు ప్రాంతాల్లో సైనిక వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్’ డీజిల్‌ను రూపొందించింది.
సాధారణంగా డీజిల్ అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద గడ్డకట్టి వాహనాల ఫిల్టర్లను మూసివేస్తుంది. అయితే, ఈ నూతన ఎక్స్‌డబ్ల్యూజీ డీజిల్ మైనస్ 42 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా సమర్థంగా పనిచేస్తుంది. బీఎస్-VI ప్రమాణాలకు అనుగుణంగా రూపొందంచిన ఈ ఇంధనాన్ని, ప్రస్తుత సైనిక వాహనాల్లో ఎటువంటి సాంకేతిక మార్పులు చేయకుండానే నేరుగా వినియోగించవచ్చు. భారత సైన్యం, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సమన్వయంతో కేవలం ఏడాది వ్యవధిలోనే దీనిని అభివృద్ధి చేయడం గమనార్హం.
ఈ ఆవిష్కరణను ఆర్మీ చీఫ్ ‘గేమ్ చేంజర్’గా అభివర్ణించారు. ఇది సైనిక వాహనాల కదలికలను సులభతరం చేయడమే కాకుండా, సమర సన్నద్ధతను మరియు కార్యాచరణ విశ్వసనీయతను గణనీయంగా పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. శీతాకాలంలో వాహనాలను స్టార్ట్ చేసేందుకు గతంలో అనుసరించిన ప్రమాదకర పద్ధతులకు ఇది స్వస్తి పలుకుతుందని, తద్వారా సైనిక సిబ్బంది భద్రతతో పాటు మనోధైర్యం పెరుగుతుందని ఆయన వివరించారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో చేపట్టిన ఈ కృషి, భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక ఇంధనాల తయారీకి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. కేవలం సైనిక అవసరాలకే కాకుండా, తీవ్రమైన చలి ఉండే ప్రాంతాల్లో పౌర రవాణా అవసరాలకు కూడా ఈ డీజిల్ ఎంతగానో దోహదపడనుంది.








