ఇన్నాళ్లూ అందర్నీ గెలిపించిన పీకే.. గెలుపు రుచిని సొంతంగా చూసేశాడు..
జన్ సురాజ్ పార్టీ నేత, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సొంతంగా గెలుపు రుచిని చవిచూశారు.ఇన్ని సంవత్సరాల పాటు ఇతర నేతలను, పార్టీలను అధికార పీఠాలను ఎక్కించిన ఆయన.. స్వయంగా ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే పీఠం ఎక్కారు. దీంతో జన సురాజ్ పార్టీకి తొలి విజయం దక్కింది. బిహార్ లోని బకీంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పీకే ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ ను 18,953 ఓట్ల తేడాతో ఓడించారు. ప్రశాంత్ కిశోర్ కి 63,203 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 44250 ఓట్లు వచ్చాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,085 ఓట్లతో మూడో స్థానానికే పరిమితం అయ్యారు.
నితిన్ నబీన్ కుటుంబానికి కంచుకోట అయిన స్థానాన్ని కైవసం చేసుకుని, బీహార్‌లో బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఎదురైన తొలి ఎన్నికల సమరంలో నితిన్ నబీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
తనను గెలిపించడం ద్వారా ‘బీహార్ రాష్ట్రానికి ఒక మంచి నేతను ముఖ్యమంత్రిగా నియమించాలి’ అన్న సందేశాన్ని బీజేపీ అగ్రనాయకత్వానికి ఓటర్లు పంపారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఓటర్లు తనపై చూపించిన విశ్వాసాన్ని గౌరవించి, బాంకీపూర్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు. ఉప ఎన్నిక ఫలితాన్ని గౌరవిస్తామని బీజేపీ రాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రకటించారు.








