మారుమూల గ్రామాలకు బైక్ అంబులెన్స్ లు..!
దేశంలో అత్యవసర వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సన్నటి సందులు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాలు మరియు పెద్ద వాహనాలు వెళ్లడానికి వీల్లేని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సైతం క్షణాల్లో వైద్య సాయం అందించడమే లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహన అంబులెన్సుల(Bike Ambulance) నిర్వహణకు చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర మోటారు వాహన నిబంధనలు-1989కి సవరణలు ప్రతిపాదించింది.
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు లేదా గుండెపోటు వంటి అత్యవసర సమయాల్లో గోల్డెన్ అవర్ రోగి ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలకం. పెద్ద అంబులెన్సులు ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం వల్లో, లేదా గ్రామాల్లోని రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్లో సకాలంలో చేరుకోలేకపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి బైక్ అంబులెన్స్‌లను తీసుకువస్తున్నారు. పారామెడికల్ సిబ్బంది ఈ బైక్‌లపై అత్యవసర మందులు, ఆక్సిజన్ కిట్లతో వేగంగా రోగి వద్దకు చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడతారు.
సాధారణ మోటార్ సైకిళ్లను అంబులెన్సులుగా మార్చడానికి వీలుగా ప్రత్యేక రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ మరియు నిర్వహణ నిబంధనలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ బైక్ అంబులెన్స్ లలో సైరన్, బ్లూ లైట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, చిన్న ఆక్సిజన్ సిలిండర్ వంటి సౌకర్యాలు అమర్చడానికి ప్రత్యేక అనుమతులు ఇస్తారు. ఈ కొత్త నిబంధనల ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై ఏవైనా అభ్యంతరాలు లేదా సలహాలు ఉంటే తెలియజేయడానికి ప్రజలకు, రవాణా రంగ నిపుణులకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ గడువు ముగిసిన అనంతరం సూచనలను పరిశీలించి తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. అక్టోబర్ 1, 2027 నుండి మార్కెట్లోకి వచ్చే కొత్త వాహనాలకు ఈ నిబంధనలు పూర్తిగా వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.








