హమ్మయ్య శ్రీశైలం నిండింది.. నిండుకుండలా జలాశయం..!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయమైన శ్రీశైలం(Srisailam) ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు పూర్తిగా నిండటంతో దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం వేగంగా జలకళను సంతరించుకుంటోంది. జలాశయం యొక్క కనీస నీటి మట్టం దాటి, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ రికార్డు స్థాయిలో 92.04 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ ప్రవాహం ఇలాగే కొనసాగితే రానున్న కొద్ది రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శ్రీశైలంలో నీటి నిల్వలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ తాగు, సాగునీటి అవసరాల కోసం ఇంకా నీటిని విడుదల చేయకపోవడం గమనార్హం. రాయలసీమకు జీవనాడులైన హంద్రీ–నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ల ద్వారా నీటిని వదిలేందుకు చంద్రబాబు(Chandrababu) సర్కార్ ఇంకా ఎలాంటి అధికారిక చర్యలు చేపట్టలేదు. వరద నీరు భారీగా వస్తున్న తరుణంలోనే వీటి ద్వారా రాయలసీమలోని చెరువులు, రిజర్వాయర్లను నింపాలని ఆ ప్రాంత రైతులు మరియు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఏపీ వైపు కాలువలు ఇంకా నిశ్శబ్దంగానే ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీశైలం వెనుక జలాలను వాడుకుంటోంది. మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని ఆయకట్టుకు నీరందించే మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ అధికారులు పంపులను ఆన్ చేసి యథేచ్ఛగా నీటిని తరలించుకుంటున్నారు. ఇప్పటికే మొదటి దశ పంప్ హౌస్ ద్వారా వందలాది క్యూసెక్కుల నీరు ఎల్లూరు జలాశయానికి వెళుతోంది.
కృష్ణా నది ఎగువ రాష్ట్రమైన కర్ణాటకలో వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. ఆల్మట్టి డ్యామ్‌లోకి ప్రస్తుతం 1,25,855 క్యూసెక్కుల ఇన్-ఫ్లో వస్తుండగా, స్పిల్‌వే మరియు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 1,28,417 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అటు నారాయణపూర్ డ్యామ్‌లోకి 1,28,954 క్యూసెక్కుల వరద చేరుతుండటంతో, గేట్లు ఎత్తి 1,23,364 క్యూసెక్కుల నీటిని జూరాల మీదుగా శ్రీశైలానికి వదులుతున్నారు. ఈ భారీ ప్రవాహం కారణంగా మరో మూడు రోజుల పాటు శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇదే రీతిలో వరద కొనసాగనుందని సమాచారం.








