తెలంగాణ కాంగ్రెస్లో పట్టభద్రుల టికెట్ల వేడి..!
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న కీలకమైన ఎన్నికలు కావడం, విద్యావంతులు, ఉద్యోగుల నాడిని ప్రతిబింబించే పోరు కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల సమరసన్నాహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏదేమైనా రెండు స్థానాల్లోనూ గెలిచి తీరాల్సిందేనని, విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని పార్టీ అధిష్టానం ముఖ్యనేతలకు స్పష్టమైన టార్గెట్ నిర్దేశించింది.
అధికార పార్టీ తరఫున రేసులో నిలిచి ఎమ్మెల్సీగా సభలో అడుగుపెట్టేందుకు సీనియర్లు, యువ నేతలు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. పోటీకి దిగేందుకు ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. మహబూబ్నగర్ – హైదరాబాద్ – రంగారెడ్డి పట్టభద్రుల స్థానానికి ఆశావహులు భారీగా ఉన్నారు. ఇక రాజధాని నగరం పరిధిలోని ఉమ్మడి మహబూబ్నగర్ – హైదరాబాద్ – రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్లో గట్టి పోటీ నెలకొంది. ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాల్లో పట్టున్న పలువురు ముఖ్య నేతలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధిగా గుర్తింపు ఉన్న హర్ష వర్ధన్ రెడ్డి విద్యావంతుల మద్దతు తనకే ఉందనే ధీమాతో ఉన్నారు. సామ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ గా పార్టీ వాణిని బలంగా వినిపిస్తున్నారు. ఆయన టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. టీ శాట్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న శివసేనా రెడ్డి యువత, విద్యావంతులలో మంచి గుర్తింపు పొందారు. ఇక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ రెడ్డి యువజన విభాగానికి ప్రాతినిధ్యం కల్పిస్తూ రేసులో ముందంజలో ఉన్నారు. వీళ్లతో పాటు పార్టీ సీనియర్ నాయకుడు గౌరీ సతీష్ తో పాటు మన్నే జీవన్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్కు పట్టున్న ప్రాంతంగా భావించే నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల స్థానానికి డిమాండ్ ఊహించని స్థాయిలో ఉంది. పార్టీలోని కీలక సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ఎక్కువమంది ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఇక్కడ టికెట్ దక్కించుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పేరు ఈ స్థానం నుంచి ప్రముఖంగా వినిపిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉద్యమ నేతగా పేరుపొందిన చనగాని దయాకర్ సైతం విద్యార్థి, నిరుద్యోగ వర్గాల మద్దతు తనకే ఉందంటూ పోటీలో నిలిచారు. స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇందిర కూడా ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు.
కోర్ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చించిన అనంతరం, విజయావకాశాలు ఉన్న నేతలనే బరిలోకి దించాలని హైకమాండ్ సూచించింది. సామాజిక సమీకరణాలు, క్షేత్రస్థాయి సమీకరణాలు, ఉద్యమ నేపథ్యం, అలాగే పట్టభద్రులలో ఉన్న ప్రజాదరణ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుల నిర్ణయంపైనే ప్రస్తుతం ఈ ఆశావహుల జాతకాలు ఆధారపడి ఉన్నాయి. ఎవరికి ఎమ్మెల్సీ టికెట్ వరిస్తుంది? అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్న ప్రధాన అంశం!








