సముద్ర మంథన్ ఏపీకి ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలి: ఎంపీ సానా సతీష్ బాబు
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన పెట్రోలియం , నేచరల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పాల్గొన్నారు. ‘సముద్ర మంథన్ – ఆఫ్‌షోర్ అన్వేషణ ద్వారా వికసిత భారత్’ అంశంపై జరిగిన ఈ సమావేశంలో ఆయన పలు కీలక ప్రసంగాలు చేశారు.
ఈ సందర్భంగా సముద్ర మంథన్ కార్యక్రమాన్ని ఆయన స్వాగతిస్తూ, కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న దేశంలోని అత్యంత కీలకమైన ఆఫ్‌షోర్ ఇంధన వనరుల ప్రాంతమని గుర్తుచేశారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి గరిష్ఠ ప్రయోజనాలు అందేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నౌకాశ్రయాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు , నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రత్యేకంగా ‘ఆయిల్ అండ్ గ్యాస్ తయారీ జోన్’ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తీర ప్రాంత యువతకు అత్యాధునిక నైపుణ్యాలను అందించేందుకు ఒక ‘ఆఫ్‌షోర్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్’ను ఏర్పాటు చేసి, స్థానిక చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSME) తగిన అవకాశాలు కల్పించాలని కోరారు.
కేజీ బేసిన్లో లభించే డీప్‌వాటర్ వెల్స్‌లో నిర్దిష్ట వాటాను రాష్ట్రానికి కేటాయించాలని కోరారు.
కాకినాడ లేదా విశాఖపట్నంలో ‘కామన్ ఆఫ్‌షోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్’ను ఏర్పాటు చేసి, ఆఫ్‌షోర్ ఉత్పత్తి, ప్రాసెసింగ్ , రవాణా కార్యకలాపాలకు దానిని ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ఏర్పడే ఉపాధి అవకాశాలలో తీర ప్రాంత యువతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 974 కిలోమీటర్ల విశాలమైన సముద్ర తీరం, అపార సహజ వనరులతో కూడిన కేజీ బేసిన్, ప్రపంచ స్థాయి పోర్టులు , అద్భుతమైన పారిశ్రామిక సామర్థ్యం ఉన్నాయని సానా సతీష్ బాబు పేర్కొన్నారు. ఇవన్నీ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రధాన ఆఫ్‌షోర్ ఎనర్జీ హబ్‌గా నిలబెట్టగలవని విశ్వాసం వ్యక్తం చేశారు. సముద్ర మంథన్ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కేవలం ఇంధన రంగంలోనే కాకుండా, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు , ఉపాధి కల్పనలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








