న్యాయపరమైన చిక్కుల్లో ట్రంప్ నూతన సుంకాలు..కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు..!
ప్రపంచదేశాలపై సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నూతన నిర్ణయంపై.. స్వదేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌తో సహా 60 భాగస్వామ్య దేశాలపై ట్రంప్ విధించిన కొత్త పన్నులను సవాలు చేస్తూ.. అమెరికాలోని 25 డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ ప్రభుత్వం తమ చట్టబద్ధమైన పరిమితులను దాటి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ దావా వేశాయి. న్యూయార్క్‌లోని ‘యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్’లో 25 రాష్ట్రాల కూటమి ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
వెట్టి చాకిరీ ద్వారా తయారుచేసిన వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం అమలు చేయడం లేదనే ఆరోపణలతో గత నెలలో ట్రంప్ ప్రభుత్వం సుంకాలను విధించింది. భారత్ సహా దాదాపు 60 భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు కొత్త సుంకాలను (Tariff) విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సుంకాల వల్ల వినియోగదారులు, వ్యాపారాలపై భారం పడుతుందన్న 25 రాష్ట్రాలు ఇప్పుడు కోర్టును ఆశ్రయించాయి. ఇంతకుముందు కూడా ట్రంప్ విధించిన అనేక సుంకాల నిర్ణయాలు అమెరికా కోర్టులలో చట్టపరమైన చిక్కులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త టారిఫ్‌లపై నమోదైన కేసు ట్రంప్ వాణిజ్య విధానాలకు మరో పెద్ద పరీక్షగా మారనుంది.
ప్రారంభంలో భారత్‌పై 12.5 శాతం టారిఫ్ విధించాలని ప్రతిపాదించినప్పటికీ.. వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఈ పన్నును 10 శాతానికి తగ్గించారు. చమురు, సహజ వాయువు, ఎరువుల దిగుమతులకు, అలాగే యూఎస్-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చే వస్తువులకు ఈ పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చారు.








