మనుషుల కోసం ఫ్రిజ్, క్యూ కడుతున్న జనం!!
“మరో రెండు నిమిషాలు ఆలస్యమై ఉంటే… ఇతను బతికేవాడు కాదు.”
ఎవరో గట్టిగా అరిచారు. ఆ వ్యక్తి కాళ్లు తూలుతున్నాయి. చొక్కా పూర్తిగా చెమటతో తడిసిపోయింది. కళ్లు తెరిచి ఉన్నా… చూపు మాత్రం ఎక్కడో శూన్యంలో నిలిచిపోయింది. చుట్టూ నిలబడ్డ వాళ్లు ఒక్కసారిగా అతన్ని పట్టుకుని ఒక భారీ స్టీల్ బాక్స్ ముందు తీసుకొచ్చారు.
తలుపు తెరిచారు. “లోపలికి… వెళ్లండి”. అంతే. అతను అలాగే తూలుకుంటూ లోపల అడుగుపెట్టాడు.భారీ ఇనుప తలుపు నెమ్మదిగా మూసుకుంది. బయట ఉన్నవాళ్లు గడియారం వైపు చూస్తున్నారు. ఒక నిమిషం…
రెండు నిమిషాలు… మూడు నిమిషాలు… లోపల ఏం జరుగుతుందో బయట ఉన్నవారికి కనిపించటం లేదు. కానీ కొన్ని క్షణాల తర్వాత…అదే తలుపు మళ్లీ తెరుచుకుంది. కాసేపటి క్రితం నిలబడలేని వ్యక్తి… ఇప్పుడు తనంతట తానే బయటకు నడుచుకుంటూ వచ్చాడు. అతని ముఖంపై ఇప్పుడు చెమట లేదు. ఊపిరి ఎగబీల్చటం లేదు. శరీరం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది.
ఇది హాలీవుడ్ సినిమాలో మనుషులను గడ్డకట్టించి మళ్లీ బ్రతికించే ‘క్రయో ఛాంబర్’ కాదు. ఇది అంతరిక్ష నౌకలోని మెడికల్ ఛాంబర్ కాదు. భవిష్యత్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూపించే ‘హ్యూమన్ క్యాప్సూల్’ కూడా కాదు. జపాన్‌లో ఈరోజు నిజంగా ఉపయోగిస్తున్న మనిషి కోసం తయారైన ఫ్రిజ్. పేరు ‘డో హియేమోన్ బాక్స్’.
ప్రపంచం వేడెక్కుతున్న కొద్దీ, టెక్నాలజీ కూడా ఊహించని దిశగా పరిగెడుతోంది. ఒకప్పుడు ఆహారం పాడవకుండా కాపాడేందుకు కనిపెట్టిన ఫ్రిజ్… ఇప్పుడు మనిషి ప్రాణాలను కాపాడే పరికరంగా మారుతోంది.
‘డో హియేమోన్ బాక్స్’ పేరుతో రూపొందించిన ఈ ప్రత్యేక కూలింగ్ బూత్ బయటకు చూస్తే ఒక భారీ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రిజ్‌లా కనిపిస్తుంది. కానీ ఇందులో పండ్లు, కూరగాయలు కాదు… వడదెబ్బతో అలసిపోయిన మనిషి కూర్చుంటాడు.
తలుపు మూసుకున్న వెంటనే లోపల ఉష్ణోగ్రత సుమారు 15 డిగ్రీల సెల్సియస్‌కు చేరుతుంది. అదే సమయంలో 5 డిగ్రీల చల్లని గాలి నేరుగా తల, మెడ, భుజాలపైకి వీస్తుంది. కొన్ని నిమిషాల్లోనే శరీర ఉష్ణోగ్రత తగ్గి హీట్ స్ట్రోక్ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం కలుగుతుంది.
ఈ పరికరాన్ని ఎయిర్ కండిషనర్కు ప్రత్యామ్నాయంగా తయారు చేయలేదు. ఎండలో గంటల తరబడి పనిచేసే నిర్మాణ కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, గోల్ఫ్ కోర్సు సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు వడదెబ్బ బారిన పడకుండా కాపాడడానికే దీన్ని రూపొందించారు.
దీనిని ‘ట్రస్కో నకయామా’ (Trusco Nakayama) అనే కంపెనీ రూపొందించింది. ఒక్కో యూనిట్ ధర సుమారు 15 లక్షల యెన్లు (సుమారు రూ. 8.5 లక్షలకు పైగా). 2026 ప్రారంభంలో ఇవి అమ్మకానికి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 200 యూనిట్లను విక్రయించారు.ఇటీవలే కుమమోటోలో భూకంపం వచ్చినప్పుడు బాధితుల పునరావాస కేంద్రాలకు కూడా ఈ బాక్సులను పంపించారు.
జపాన్‌లో ఇప్పుడు 35 డిగ్రీల సెల్సియస్ దాటే ఉష్ణోగ్రతలు సాధారణమవుతున్నాయి. ప్రతి వేసవిలో హీట్ స్ట్రోక్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా ఆఫీస్ లు, పరిశ్రమల్లో ఉద్యోగుల భద్రతపై స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ‘హ్యూమన్ ఫ్రిజ్’కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది.
ఇప్పటికే వందల సంఖ్యలో ఈ బూత్‌లు అమ్ముడయ్యాయి. ఒక్కో యూనిట్ ధర సుమారు రూ.9 లక్షలు అయినప్పటికీ, అమెరికా, జర్మనీ వంటి దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి.
ఈ కథలో అసలు షాక్… ఈ ఫ్రిజ్ కాదు.
మనిషిని ఫ్రిజ్‌లో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి రావడం. ఒకప్పుడు “ఈరోజు ఎంత ఎండ!” అని చెప్పుకుని నీళ్లు తాగేవాళ్లం. ఇప్పుడు “వడదెబ్బ తగలకముందే ఫ్రిజ్‌లోకి వెళ్లండి” అని చెప్పే రోజులు మొదలవుతున్నాయి. అది జపాన్ కథ మాత్రమే కాకపోవచ్చు. 45 నుంచి 50 డిగ్రీల ఎండలను చూస్తున్న భారత్ కూడా… ఇదే భవిష్యత్తు వైపు నెమ్మదిగా నడుస్తుందేమో అనిపిస్తోంది.
చివరగా..
చరిత్రలో ఒకప్పుడు ఫ్రిజ్ కనిపెట్టింది ఆహారాన్ని పాడవకుండా కాపాడటానికి. ఇప్పుడు అదే ఫ్రిజ్… మనిషిని బతికించడానికి ఉపయోగపడుతోంది.
టెక్నాలజీ మారిందా? అంటే కాదు. మారింది… భూమి అని చెప్పాలి.








