సినీ ప్రేమికులకు శుభవార్త: PVR Inox ‘స్మార్ట్ సినిమా’ కాన్సెప్టు
— సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒకప్పుడు ప్రతి చిన్నటౌన్ లో సినిమా థియేటర్లు కుప్పలు తెప్పలుగా ఉండేవి.ఎక్కువ శాతం సింగిల్ థియేటర్స్. శుక్రవారం కొత్త సినిమా విడుదలైతే ఆ థియేటర్ ముందు క్యూలు కనిపించేవి. హీరో కటౌట్లు, బ్యాండ్లు, టపాసులు, హౌస్‌ఫుల్ బోర్డులు… అవే ఆ టౌన్ వీకెండ్ వాతావరణాన్ని డిసైడ్ చేసేవి.
చూస్తూండగానే కాలం మారిపోయింది. ఇప్పుడు ఆ థియేటర్లలో చాలా వరకూ మూతపడ్డాయి. కొన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లుగా మారాయి. మరికొన్ని కళ్యాణ మండపాలుగా మారిపోయాయి. ఇంకొన్ని పేరుకే థియేటర్లు… ఏడాదిలో కొన్ని రోజులే సినిమా ప్రదర్శిస్తున్నాయి. ఇదంతా చూసి “OTT వచ్చాక థియేటర్ల పని అయిపోయింది.” అని మనం ఫిక్సైపోయాం.
ఎందుకంటే ఇంట్లోనే పెద్ద టీవీ ఉంది. చేతిలో పెద్ద మొబైల్ ఉంది. నచ్చినప్పుడు సినిమా చూడొచ్చు. అలాంటి పరిస్థితుల్లో పనిగట్టుకుని, ప్లాన్ చేసుకుని థియేటర్‌కి ఎందుకు వెళ్తారు? దాంతో సినిమా థియేటర్ లో చూడాలనే కాన్సెప్టు మెల్లిగా తగ్గిపోతుందని అనిపించే వాతావరణం క్రియేట్ అయ్యింది.
కానీ రివర్స్ లో
అయితే అదే సమయంలో ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం మొదలైంది. దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ అయిన PVR INOX మాత్రం థియేటర్ల భవిష్యత్తుపై పూర్తిగా భిన్నమైన బెట్ కాస్తోంది. వచ్చే మూడు సంవత్సరాల్లో చిన్న టౌన్ లలో 300 ‘స్మార్ట్ సినిమా’ థియేటర్లు ప్రారంభిస్తామని ప్రకటించింది. అదీ టికెట్ ధరను దాదాపు ₹150-₹175 కి పరిమితం చేస్తూ. ఆశ్చర్యంగా ఉంది కదూ…
ఓ ప్రక్కన థియేటర్ వ్యాపారం చనిపోతోందని అందరూ చెబుతుంటే…ఆచి,తూచి ముందుకు వెళ్తూ, ఎన్నో లెక్కలు వేసి మాత్రమే పెట్టుబడులు పెట్టే సంస్థ మాత్రం ఎందుకు కొత్త థియేటర్లు కడుతోంది? అంటే PVRకి కనిపిస్తున్న మార్కెట్… మిగతా వాళ్లకు కనిపించడం లేదా?
సమస్య థియేటర్లలో కాదు… వాటి లొకేషన్లో ఉందా?
ఇక్కడ PVR ఆలోచన చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. కంపెనీ అభిప్రాయం ప్రకారం భారతదేశంలో సినిమా ప్రేక్షకులు తగ్గిపోలేదు. మంచి థియేటర్లు మాత్రం ఇంకా చాలా ప్రాంతాలకు చేరలేదు. ఇప్పటికీ దేశంలోని వందలాది చిన్న పట్టణాల్లో కుటుంబంతో కలిసి వెళ్లి సినిమా చూసే ఆధునిక మల్టీప్లెక్స్ ఎక్సపీరియన్స్ అందుబాటులో లేదు. కొత్త సినిమా మల్టీప్లెక్స్ లో చూడాలంటే చాలామంది దగ్గర్లోని పెద్ద సిటీకి వెళ్లాల్సి వస్తోంది.
అక్కడికి వెళ్లే ప్రయాణ ఖర్చు… టికెట్ ధర… పార్కింగ్… ఫుడ్…ఇవన్నీ కలిపేసరికి సినిమా ఒక ఖరీదైన అవుటింగ్‌గా మారుతోంది. అవన్నీ గమనించిన PVR ఇప్పుడు మరో లెక్క వేస్తోంది. “ప్రేక్షకుడిని సిటీకి రప్పించడానికి బదులు… మల్టీప్లెక్స్నే ప్రేక్షకుడి దగ్గరకు తీసుకెళ్దాం.” అదే ‘స్మార్ట్ సినిమా’ కాన్సెప్ట్.
‘స్మార్ట్’ అంటే చిన్నది కాదు… తెలివైన వ్యాపార మోడల్
పేరు వింటే ఇది సాధారణ లేదా తక్కువ స్థాయి థియేటర్ అనిపించొచ్చు. కానీ PVR ఉద్దేశం అది కాదు. కానీ ఉద్దేశ్యం వేరు. మెట్రో నగరాల్లో ఉన్న సినిమా చూసే ఎక్సపీరియన్స్ ని వీలైనంత వరకు అలాగే ఉంచి, ఖర్చులను మాత్రమే తగ్గించడం.
సాధ్యమేనా
చిన్న పట్టణాల్లో భూమి చౌక. నిర్మాణ వ్యయం తక్కువ. విద్యుత్, సిబ్బంది ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ ప్రయోజనాలతోనే టికెట్ ధరను ₹175 వరకు తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. అంటే ప్రేక్షకుడికి తక్కువ ధరకే అద్బుతమైన ఎక్సపీరియన్స్. కంపెనీకి నిలకడైన వ్యాపారం.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే కథ కనిపిస్తుందా?
మరి మన తెలుగు ప్రేక్షకుడి పరిస్ధితి ఏమిటి… వీళ్లు చెప్పే లెక్కలు ప్రకారం చిన్న టౌన్ లలో కూడా ఇలాంటి మల్టీప్లెక్స్‌లు వస్తాయా? వస్తే మంచిదే.
మరి సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి?
అంతా బాగానే ఉంది. కానీ ఇప్పటికే చాలా పాత థియేటర్లు ప్రేక్షకుల కోసం పోరాడుతున్నాయి. కొన్ని మూతపడ్డాయి. కొన్ని ఇతర గొడౌన్స్ గా, కళ్యాణ మండపాలుగా ఇలా రకరకాల వ్యాపారాలుగా మారిపోయాయి. ఇప్పుడు అదే టౌన్ లో మల్టీప్లెక్స్ వస్తే…ఆ పాత థియేటర్లు పోటీని తట్టుకోగలవా? లేక మరిన్ని థియేటర్లు కూడా చరిత్రలో కలిసిపోతాయా? ఏమో చెప్పలేం.
అయితే మరో కోణం కూడా ఉంది.
కొత్త పోటీ రావడం వల్ల మిగిలిన థియేటర్లు కూడా సీట్లు, సౌండ్, పరిశుభ్రత, సేవలపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలా అయితే చివరికి గెలిచేది ప్రేక్షకుడే. ఇక్కడ అర్దం చేసుకోవాల్సింది ఒకటే. మారుతోంది థియేటర్ కాదు… భారతదేశమే. ఇది భారతదేశంలో వినియోగదారుల ప్రవర్తన మారుతోందనే సంకేతం.
వింతేమీ లేదు
ఒకప్పుడు పెద్ద నగరాల్లో మాత్రమే కనిపించిన బ్రాండ్లు ఇప్పుడు చిన్న పట్టణాల్లోకి వెళ్తున్నాయి. మాల్స్ వెళ్తున్నాయి. జాతీయ రిటైల్ చైన్లు వెళ్తున్నాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్‌లు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. అంటే PVR ఒక కొత్త థియేటర్‌ను నిర్మించడం లేదు. భారత సినిమా మార్కెట్లో తదుపరి డవలప్మెంట్ ఎక్కడ ఉందో గమనిస్తోంది.
కాబట్టి
ఓ ప్రక్క పాత థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారుతున్నాయి. మరోవైపు దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ వందల కొత్త థియేటర్లు కడుతోంది. ఈ రెండు దృశ్యాలు ఒకేసారి కనిపిస్తున్నాయంటే…చనిపోతోంది థియేటర్ వ్యాపారం కాదు. మారుతోంది థియేటర్ వ్యాపారం అని అర్దం చేసుకోవాలి. ఆ మార్పును ముందుగా ఎవరు అర్థం చేసుకుని దూసుకుపోతారనేదే అసలు పోటీ.








