టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవికి ఎసరు..?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్షన్ కమిటీలో ఊహించని భారీ మార్పులు జరగబోతున్నాయనే వార్తలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుత టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) పదవి తీవ్ర ముప్పులో పడిందని, ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించడానికి బోర్డు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారని క్రీడా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆయన స్థానంలో భారత మాజీ దిగ్గజ బ్యాటర్, ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (Centre of Excellence) హెడ్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌ను కొత్త చీఫ్ సెలెక్టర్‌గా నియమించేందుకు గట్టి కసరత్తు జరుగుతోంది.
రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్కు సంబంధించిన కొన్ని అంతర్గత లీకులు, పరిపాలనాపరమైన లోపాలు మరియు జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లతో అగార్కర్‌కు కమ్యూనికేషన్ గ్యాప్ పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలతో అగార్కర్ పదవీకాలం ముగియనుండగా, ఆయన కాంట్రాక్ట్ ను పొడిగించే ఉద్దేశం బీసీసీఐకి లేదని స్పష్టమవుతోంది. ఒకవేళ అగార్కర్ స్వచ్ఛందంగా తప్పుకోకపోతే, బోర్డే నేరుగా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు అంతర్గత వర్గాల సమాచారం.
రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని, యువ ప్రతిభను గుర్తించడంలో దిట్ట అయిన లక్ష్మణ్‌ను ఈ కీలక పదవికి సరైన వ్యక్తిగా బీసీసీఐ భావిస్తోంది. జాతీయ క్రికెట్ అకాడమీలో యువ ఆటగాళ్లతో నిరంతరం ప్రయాణించిన లక్ష్మణ్ అనుభవం జట్టు భవిష్యత్తు పునర్నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడుతుందని బోర్డు పెద్దలు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే అగార్కర్ స్థానంలో లక్ష్మణ్ నియామకంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.








