రేవంత్ సవాల్‌ను స్వీకరించి కేసీఆర్ సభకు వస్తారా?
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. గులాబీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి అసెంబ్లీ గుమ్మం తొక్కుతారా? అనే ప్రశ్న మరోసారి తలెత్తుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసురుతున్న సవాళ్లు, వేస్తున్న ప్రశ్నల దెబ్బకు ఈ ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, నిధుల వినియోగం, డిజైన్ లోపాలపై నేరుగా కేసీఆర్ సమక్షంలోనే విచారించాలన్నది కాంగ్రెస్ వ్యూహమైతే, అదే వేదికగా ప్రభుత్వాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
లక్ష కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అంశం ఈ సమావేశాల్లో ప్రధాన అజెండాగా మారనుంది. ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన, సాంకేతిక వైఫల్యానికి చిహ్నంగా ప్రజల మనస్సుల్లో ముద్ర వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ పురోగతితో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికలను సభ ముందుకు తెచ్చి, కేసీఆర్‌ను కట్టడి చేయాలని కాంగ్రెస్ చూస్తోంది.
మరోవైపు, కాళేశ్వరాన్ని ఆయుధంగా మలచుకుని కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టాలని కేటీఆర్, హరీష్ రావులు భావించినప్పటికీ, క్షేత్రస్థాయి పరిణామాలు వారికి ప్రతిబంధకంగా మారాయి. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ప్రవాహం, బ్యారేజీ సాంకేతిక పరిమితుల వల్ల నీటి నిల్వ ప్రమాదకరమన్న నిపుణుల హెచ్చరికలు బీఆర్ఎస్ వాదనను కొంత బలహీనపరిచాయి. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టాలని చూసిన బీఆర్ఎస్కు, ఈ సాంకేతిక అంశాలు రక్షణ ధోరణిలోకి నెట్టాయి.
ఇప్పుడు ప్రధాన చర్చ అంతా కేసీఆర్ హాజరు పైనే నడుస్తోంది. గత సమావేశాలకు ఆయన దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. అయితే ఈసారి కేసీఆర్ సభకు వస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై భిన్న కోణాలు ఉన్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ నేరుగా సభకు వచ్చి కాళేశ్వరం రీ-డిజైనింగ్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని, సాంకేతిక అంశాలను స్వయంగా వివరిస్తే, అది బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి ముఖాముఖి సవాల్ విసురుతూ, రక్షణ ధోరణి నుంచి దూకుడు ధోరణిలోకి మారే అవకాశం లభిస్తుంది. ఒకవేళ కేసీఆర్ ఈసారి కూడా సభకు దూరంగా ఉంటే, అది కాంగ్రెస్ విమర్శలకు మరింత బలాన్ని ఇస్తుంది. ‘ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే మాజీ సీఎం తప్పించుకుంటున్నారు’ అనే ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
కేసీఆర్ హాజరుపై స్పష్టత లేకపోయినా, సభలో ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం సన్నద్ధమవుతోంది. కాళేశ్వరం అంశంతో పాటు నిరుద్యోగ సమస్య, హామీల అమలులో ఆలస్యం వంటి అంశాలను సభలో లేవనెత్తి కాంగ్రెస్‌ను కార్నర్ చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఏది ఏమైనా, ఈ వర్షాకాల సమావేశాలు కేవలం ఒక సాధారణ చట్టసభ చర్చలకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయ గమనాన్ని, ప్రజాభిప్రాయాన్ని మార్చే అత్యంత కీలక ఘట్టంగా మారబోతున్నాయి. కేసీఆర్ అడుగులు ఏ వైపు పడతాయో వేచి చూడాలి.








