ప్రదీప్ రావత్ తెలుగు ఇంటి అల్లుడే… ‘సై’ ఆయన కెరీర్‌తో పాటు జీవితాన్నీ మార్చేసింది
—సూర్య ప్రకాష్ జోశ్యుల
తెరపై కనిపిస్తే చాలు… ప్రేక్షకుల్లో భయం పుట్టించే విలన్. సైలో బిక్షు యాదవ్‌గా, గజినిలో గజిని ధర్మాత్మగా, లగాన్‌లో దేవా సింగ్ సోధిగా తనదైన ముద్ర వేసిన ప్రదీప్ రావత్ ఇక లేరు. కానీ ఆయన గురించి చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో భాషల్లో విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు… నిజానికి తెలుగువారి అల్లుడు.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో జన్మించిన ప్రదీప్ రావత్, 1980లలో నటుడిగా ప్రయాణం ప్రారంభించారు. బీఆర్ చోప్రా రూపొందించిన మహాభారత్ టెలివిజన్ సిరీస్‌లో అశ్వత్థామ పాత్ర ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సర్ఫరోష్, లగాన్, ది హీరో, గజిని వంటి హిందీ చిత్రాల్లో వరుస అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా తమిళ గజినిలో చేసిన గజిని ధర్మాత్మ పాత్రను, అదే పేరుతో వచ్చిన హిందీ రీమేక్‌లోనూ ఆయనతోనే చేయించడం ఆయన నటనకు దక్కిన అరుదైన గుర్తింపు.
అయితే ప్రదీప్ రావత్ జీవితంలో అసలు మలుపు తిరిగింది 2004లో వచ్చిన సై సినిమాతో. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో బిక్షు యాదవ్‌గా ఆయన చూపించిన నటన తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తొలి తెలుగు సినిమాకే ఫిల్మ్‌ఫేర్, నంది, సంతోషం ఉత్తమ విలన్ అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత ఛత్రపతి, స్టాలిన్, దేశముదురు, యోగి, నాయక్, 1: నేనొక్కడినే, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలతో తెలుగు చిత్రసీమలో అత్యంత బిజీ విలన్లలో ఒకరిగా నిలిచారు.
సై సినిమా ఆయన కెరీర్‌ను మాత్రమే కాదు… వ్యక్తిగత జీవితాన్నీ మార్చేసింది.
ఆ సినిమా సమయంలో మోడల్‌గా పనిచేసిన కాకినాడకు చెందిన కల్యాణితో ఆయనకు పరిచయం ఏర్పడింది. షూటింగ్‌ల మధ్య మొదలైన ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. అప్పటికే ప్రదీప్ రావత్‌కు దాదాపు 50 ఏళ్లు. అంతవరకు పెళ్లి చేసుకోని ఆయన, కల్యాణిని జీవిత భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లితో ప్రదీప్ రావత్ తెలుగువారి అల్లుడయ్యారు.
సినిమాల్లో ఎంత క్రూరమైన విలన్‌గా కనిపించినా, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన చాలా సాదాసీదా మనిషిగా ఉండేవారని ఆయనతో పనిచేసినవారు చెబుతుంటారు. తెలుగు కుటుంబంలో కలిసిపోయిన ఆయనకు ఆంధ్రప్రదేశ్‌తో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.
ప్రదీప్ రావత్, కల్యాణి దంపతులకు విక్రమ్ రావత్, సింగ్ రావత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయించేందుకు ప్రయత్నించేవారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటుంటారు.
ప్రేక్షకులు ఆయనను ఎప్పటికీ బిక్షు యాదవ్‌గా, గజిని ధర్మాత్మగా గుర్తుంచుకుంటారు. కానీ ఆయన జీవితాన్ని దగ్గరగా తెలిసినవారికి మాత్రం మరో గుర్తింపు కూడా ఉంది. అది… తెలుగింటి అల్లుడు ప్రదీప్ రావత్.








