సింప్లిసిటీతోనే సెన్సేషన్.. శివకార్తికేయన్-ఆర్తి జంట మరోసారి హాట్ టాపిక్!
సెలబ్రిటీ కపుల్ ఫోటోషూట్లు అంటే విదేశీ లొకేషన్లు, ఖరీదైన డిజైనర్ బట్టలు, భారీ ప్రొడక్షన్ సెటప్ అనేది ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అయితే తమిళ నటుడు శివకార్తికేయన్, ఆయన భార్య ఆర్తి తాజాగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం ఈ ట్రెండ్‌కు పూర్తిగా భిన్నమైన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రకృతి మధ్యలో ఎంతో సహజంగా దిగిన ఈ ఫోటోల్లో కృత్రిమత కంటే ఆప్యాయత, స్టైల్ కంటే సాన్నిహిత్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఎలాంటి ఆర్భాటం లేకుండా తీసిన ఈ ఫొటోలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పచ్చని ప్రకృతి నేపథ్యంతో సాధారణ దుస్తుల్లో కనిపించిన శివకార్తికేయన్(siva karthikeyan)- ఆర్తి(Aarthy) జంట ప్రతి ఫ్రేమ్‌లోనూ ఒక ప్రశాంతమైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తోంది. ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం, నిశ్శబ్దంగా కలిసి కూర్చోవడం, సంతోషాన్ని సహజంగా పంచుకోవడం వంటి క్షణాలు ఈ ఫోటోలకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలో గ్లామర్ ప్రధానంగా మారుతున్న సమయంలో, ఎలాంటి అతిశయోక్తి లేకుండా ప్రేమను వ్యక్తపరిచే ఈ ఫొటోలు నిజమైన అందం సింప్లిసిటీలోనే ఉంటుందనే భావనను గుర్తు చేస్తున్నాయి.
శివకార్తికేయన్, ఆర్తి దంపతులు దాదాపు పదిహేనేళ్లకుపైగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులుగా ఉన్నారు. కుటుంబ బంధాలు, పరస్పర గౌరవం, సహజమైన జీవనశైలి ఈ జంటను అభిమానులకు మరింత చేరువ చేశాయి. సినీ కెరీర్ విషయానికి వస్తే, శివకార్తికేయన్ ఆఖరిగా నటించిన సినిమా పరాశక్తి ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన తర్వాతి సినిమా సేయోన్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా, ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.








