మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..!
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ‘మాట నిలబెట్టుకున్న నాయకుడు’ అనిపించుకుంటున్నారు. ఏలూరు నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి రూ. 12.60 కోట్ల భారీ నిధులను మంజూరు చేయిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే శాశ్వత పరిష్కారం చూపడం విశేషం.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఏలూరు(Eluru) ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. స్వంత భవనాలు లేక, కనీస వసతులు కరువై విద్యార్థినులు చెట్ల కింద కూర్చుని పాఠాలు వినాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘జనవాణి’, ‘వారాహి’ విజయ యాత్రల సందర్భంగా విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కళాశాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థినుల కష్టాలను స్వయంగా చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్, నాడు ప్రతిపక్ష నేతగా నిలదీశారు.
భవిష్యత్తులో మన ప్రభుత్వం రాగానే ఈ కాలేజీకి సొంత భవనాలు కట్టించి తీరతామని ఆ రోజే విద్యార్థినులకు బరుసైన మాట ఇచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ మాటను మర్చిపోలేదు. ఏలూరు కాలేజీ భవనాల ఫైల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి రూ. 12.60 కోట్ల నిధుల మంజూరుకు బాటలు పరిచారు. ఈ నిధులతో అధునాతన వసతులు, ల్యాబ్‌లు, క్లాస్‌రూమ్‌లతో కూడిన శాశ్వత భవనాలను నిర్మించనున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ చొరవతో త్వరలోనే విద్యార్థినులకు చెట్ల కింద చదువుకునే బాధలు తప్పనున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేయించడంపై ఏలూరు విద్యార్థినులు మరియు జనసేన, కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.








