వరుణ్ తేజ్ పై ఒత్తిడి తగ్గిందా? ఇదేం మీడియా లెక్క!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
గత కొద్ది రోజులుగా వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ సినిమా బిజినెస్‌పై ఒకే రకమైన విశ్లేషణలు కనిపిస్తున్నాయి. “థియేట్రికల్ బిజినెస్ తక్కువగా జరిగింది… కాబట్టి రికవరీ టార్గెట్ కూడా చిన్నదే… వరుణ్ తేజ్‌పై ఏ ఒత్తిడి లేదు” అంటూ సోషల్ మీడియా నుంచి వెబ్సైట్ల వరకు ఇదే కథనం వినిపిస్తోంది. అయితే సరిగ్గా ఆలోచిస్తే వరుణ్ తేజ్ పై ఎక్కడ ఒత్తిడి తగ్గింది.. ఓ రకంగా పెరిగినట్లు.
ఎందుకంటే ఏ హీరోకు అయినా థియేట్రికల్ బిజినెస్ తక్కువగా జరగడం అనేది ఎప్పుడూ ప్లస్ కాదు. అది మార్కెట్ పరిస్థితిని ప్రతిబింబించే సంఖ్య మాత్రమే. మార్కెట్ తగ్గిపోయినప్పుడు సహజంగానే బిజినెస్ కూడా తగ్గుతుంది. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా తగ్గుతుంది. ఇదేమీ కొత్త వ్యాపార సూత్రం కాదు… సినిమా ట్రేడ్‌లో ఎప్పటి నుంచో ఉన్న సాధారణ లెక్క.
ఎప్పుడూ ట్రేడ్ మాట్లాడే అసలు లెక్క… “రికవరీ టార్గెట్ ఎంత?” కాదు. “ఎందుకు ఆ టార్గెట్ అంత తక్కువకు వచ్చింది?” అనేదే.
ఒకప్పుడు వరుణ్ తేజ్ సినిమాలకు రూ.20 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగేది. ‘ఘనీ’ సుమారు రూ.26 కోట్ల వరకు, ‘తొలిప్రేమ’, ‘గద్దలకొండ గణేష్’ వంటి సినిమాలు కూడా స్ట్రాంగ్ మార్కెట్‌తో విడుదలయ్యాయి. అయితే ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ మాత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసారని చెప్తున్నారు. ఇక్కడ అది నిర్మాతల తెలివితేటల కంటే ఎక్కువగా వరుణ్ తేజ్ మార్కెట్ డౌన్ అయ్యిందనే సంకేతం. ఇది ఏ హీరోకు అయినా ఇబ్బంది కలిగించే విషయమే. ఇలాంటప్పుడు హీరోపై మరింత ఎక్కువ ప్రెజర్ ఉంటుంది.
‘కొరియన్ కనకరాజు’ నిర్మాతలు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని బిజినెస్‌ను రియలిస్టిక్‌గా ప్లాన్ చేసి ఉండొచ్చు. ఓటీటీ, శాటిలైట్ హక్కులు కూడా వారికి కొంత భరోసా ఇచ్చి ఉండొచ్చు. కానీ దాన్ని “వరుణ్ తేజ్‌పై ఒత్తిడి తగ్గింది” అనే తీర్మానంగా మార్చడం సరైన విశ్లేషణ కాదు. ఎందుకంటే హీరోపై ఒత్తిడి థియేట్రికల్ బిజినెస్‌తో తగ్గదు. అది ప్రేక్షకుల నమ్మకంతో మాత్రమే తగ్గుతుంది.
వరుసగా ‘ఘనీ’, ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దాంతో ప్రేక్షకుల్లో ఏర్పడిన సందేహాన్ని తొలగించాల్సిన బాధ్యత ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ మీద ఉంది. ఈ సినిమా హిట్ అయితే వరుణ్ తేజ్ మార్కెట్ మళ్లీ పెరుగుతుంది. ఫ్లాప్ అయితే థియేట్రికల్ బిజినెస్ ఇంకా తగ్గే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ సినిమా ఆయన కెరీర్‌కు కీలకం. ఎంత కూల్ గా పైకి కనపడినా ఒత్తిడి రెండు రెట్లు ఉంటుంది.
ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. వరుణ్ తేజ్‌లో టాలెంట్ లేదని ఎవరూ చెప్పరు. ‘తొలిప్రేమ’, ‘ఎఫ్2’, ‘గద్దలకొండ గణేష్’ సినిమాలు ఆయన కమర్షియల్ పొటెన్షియల్ ని ఇప్పటికే నిరూపించాయి. కానీ ఆ తర్వాత వచ్చిన కథల ఎంపిక, జానర్ ప్రయోగాలు, స్క్రిప్ట్ ఎంపికలు ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. దాని ప్రభావమే ఇప్పుడు మార్కెట్‌పై కనిపిస్తోంది.
అందుకే ‘కొరియన్ కనకరాజు’ గురించి అసలు కథ “బిజినెస్ తక్కువ కాబట్టి టెన్షన్ లేదు” కాదు. “ఒకప్పుడు బలమైన మార్కెట్ ఉన్న హీరో ఎందుకు ఈ స్థితికి వచ్చాడు? ఈ సినిమా ఆ ప్రయాణాన్ని తిరిగి మలుపు తిప్పగలదా? లేదా” అనేదే.
థియేట్రికల్ బిజినెస్ తగ్గడం విజయానికి సూచిక కాదు. అది ప్రస్తుతం ఉన్న మార్కెట్‌కు అద్దం పట్టే సంఖ్య మాత్రమే. ఆ సంఖ్య మళ్లీ పెరగాలంటే ఒకటే మార్గం ఉంది… మంచి కథలు, స్ట్రాంగ్ సినిమా, ప్రేక్షకుల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవడం. అదే ‘కొరియన్ కనకరాజు’ ముందు ఉన్న అసలు ఛాలెంజ్.








