ఏఐ రేసులో మెటా.. ఏఐ ఆధారిత ఆటోమేటెడ్ కోడింగ్ టూల్స్ అప్లికేషన్..!
టెక్ దిగ్గజం మెటా.. మరో కీలక ముందడుకేసింది. ప్రత్యర్థులైన ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ నుంచి ఎదురవుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని.. ఏఐ డెవలపర్ల కోసం ‘మ్యూజ్ కోడ్’ (Muse Code) పేరుతో ఒక శక్తిమంతమైన అప్లికేషన్‌ను ప్రకటించింది. ఆదాయం, కస్టమర్ల పరంగా ఏఐ రంగంలో పట్టు సాధించేందుకు మెటా వేగంగా అడుగులు వేస్తోంది.
‘మ్యూజ్ కోడ్’ అనేది ఒక ఏజెటిక్ కోడింగ్ టూల్ అని, ఇది మానవ ప్రమేయం లేదా పర్యవేక్షణ తక్కువగా అవసరమయ్యే సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పనులను చేయగలదని మెటా ఒక బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. కోడ్‌ను ప్లాన్ చేయడం, రాయడం, సరిచూడటం వంటి పనులను ఇది స్వయంగా నిర్వహించగలదు. ప్రస్తుతం ఈ యాప్‌ను బీటా వెర్షన్లో (ప్రివ్యూ మోడ్) అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు తమ ఫ్లాగ్షిప్ మోడల్ అయిన ‘స్పార్క్’కు అప్డేట్గా ‘స్పార్క్ 1.2’ను కూడా విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రత్యేకంగా కోడింగ్‌పై దృష్టి సారిస్తుందని, ఇది మ్యూజ్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.
ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఏడాది ఈ కంపెనీలు కలిసి ఏఐ డేటా సెంటర్లు, చిప్స్, ఇతర మౌలిక సదుపాయాలపై సుమారు 700 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 58 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నాయని అంచనా. చాట్‌జీపీటీ వంటి చాట్బాట్లు ప్రాచుర్యం పొందినప్పటికీ, వాటికి డబ్బు చెల్లించే వారి సంఖ్య తక్కువగా ఉంది. కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కంపెనీలు మాత్రం ఆటోమేటెడ్ కోడింగ్ టూల్స్ కోసం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఈ మార్కెట్‌పై కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ (కోపైలట్, గిట్‌హబ్), ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ఏఐ (గ్రాక్) వంటివి ఈ రంగంలో ఉన్నాయి.
అయితే, ఏఐ మోడళ్ల సామర్థ్యం పెరిగే కొద్దీ భద్రతాపరమైన ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల టెస్టింగ్ సమయంలో ఓపెన్ఏఐ, యాంత్రోపిక్ అభివృద్ధి చేసిన మోడళ్లు స్వయంప్రతిపత్తితో సైబర్ దాడులకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇదే తరహాలో మెటాకు చెందిన ‘స్పార్క్ 1.1’ మోడల్‌తో కూడా ఒక సంఘటన జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై మెటా స్పందిస్తూ, థర్డ్-పార్టీ టెస్టింగ్ భాగస్వామి వద్ద ‘మిస్కాన్ఫిగరేషన్’ కారణంగా ఈ పొరపాటు జరిగిందని తెలిపింది.








