మెటాకు భారీ షాక్.. 5,400కోట్ల జరీమానా విధించిన అమెరికా కోర్ట్..!
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు అమెరికా కోర్టు షాకిచ్చింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని నిర్ధారించిన న్యూ మెక్సికో కోర్టు, కంపెనీకి 567 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 5,400 కోట్లకు పైగా) జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా రెండో దశలో జడ్జి బ్రయాన్ బీడ్షీడ్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
జరిమానా మొత్తంలో 420 మిలియన్ డాలర్లు సోషల్ మీడియా వల్ల ప్రభావితమైన యువతకు చికిత్సా సేవల కోసం కేటాయించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. మిగిలిన నిధులను రాబోయే ఐదేళ్లలో అవగాహన, నివారణ కార్యక్రమాలు, స్క్రీనింగ్ సేవలు, ఇతర సంబంధిత ఖర్చుల కోసం వినియోగించాలని ఆదేశించింది. ఈ కేసులో గత మార్చి నెలలో వెలువడిన తీర్పునకు ఇది కొనసాగింపు . ఆ సమయంలో మెటా ఉద్దేశపూర్వకంగానే పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించిందని, లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టిందని నిర్ధారించిన జ్యూరీ, కంపెనీకి 375 మిలియన్ డాలర్ల సివిల్ పెనాల్టీ విధించింది.
ఈ కేసు విచారణలో ప్రాసిక్యూటర్లు మెటా ప్లాట్‌ఫామ్‌లలో కీలక మార్పులు చేయాలని కోరారు. ముఖ్యంగా యువతను వ్యసనపరులుగా మార్చే ఫీచర్లను నియంత్రించాలని, వయసు నిర్ధారణ పద్ధతులను కఠినతరం చేయాలని, పిల్లల లైంగిక దోపిడీని అరికట్టేందుకు డిఫాల్ట్ ప్రైవసీ సెట్టింగులను మెరుగుపరచాలని వాదించారు.
అయితే, ప్రాసిక్యూటర్ల అభ్యర్థనలను కోర్టు పాక్షికంగానే అంగీకరించింది. 13 ఏళ్లలోపు పిల్లలకు వయసు నిర్ధారణను తప్పనిసరి చేయాలన్న వాదనను తోసిపుచ్చింది. అమెరికాలోని ‘చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్’ (సీఓపీపీఏ) ప్రకారం కేవలం వయసు నిర్ధారణ కోసం పిల్లల నుంచి వ్యక్తిగత సమాచారం సేకరించడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. అంతేగాక ఇతర సోషల్ మీడియా కంపెనీలకు లేని నిబంధనలను కేవలం మెటాపై మాత్రమే విధించడం సరికాదని, అది కంపెనీపై అనవసర భారం మోపుతుందని అభిప్రాయపడింది.








