TikTok ముందు డిస్నీ కూడా తలవంచిందా?
ఒకప్పుడు పిల్లలంటే డిస్నీ…
డిస్నీ అంటే మిక్కీ మౌస్, లయన్ కింగ్, ఫ్రోజెన్, మార్వెల్, స్టార్ వార్స్, పిక్సార్…
అలాగే సినిమా అంటే డిస్నీ. కథ అంటే డిస్నీ. కుటుంబ వినోదం అంటే డిస్నీ. ఇలా ప్రపంచ ఎంటర్ట్నైంట్ కి మరో పేరుగా డిస్నీ ఉండేది. అలాంటి ప్రపంచ దిగ్గజం ఇప్పుడు టిక్‌టాక్‌తో చేతులు కలపటం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
అసలు ఒప్పందం ఏమిటి?
ఇప్పటి వరకు TikTokలో చాలామంది డిస్నీ పాత్రలు, సినిమా సన్నివేశాలు ఉపయోగించి వీడియోలు చేసేవారు. కానీ అవి కాపీరైట్ సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు డిస్నీ అధికారికంగా TikTokతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో TikTok క్రియేటర్లు డిస్నీ సినిమాలు, పాత్రలకు సంబంధించిన అధికారిక క్లిప్‌లను చట్టబద్ధంగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు అలాంటి వీడియోల్లో అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేసి Disney+లో కూడా చూపించబోతున్నారు. అంటే ప్పటివరకు అభిమానులు డిస్నీ సినిమాలు చూసేవారు. ఇకపై… డిస్నీ అభిమానులు చేసిన వీడియోలను కూడా చూడబోతున్నారు. ఇదే ఈ ఒప్పందంలో అతిపెద్ద విషయం.
టిక్‌టాక్‌కు లాభం ఏమిటి?
ఈ ఒప్పందంతో TikTokకు మూడు పెద్ద ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మొదటిది…ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ అధికారిక భాగస్వామిగా మారింది. రెండోది… డిస్నీకి సంబంధించిన వీడియోలు మరింత ఎక్కువగా తయారవుతాయి. దాంతో TikTokలో కొత్త కంటెంట్ పెరుగుతుంది. వినియోగదారులు ఎక్కువ సమయం ప్లాట్‌ఫారమ్‌లో గడిపే అవకాశం ఉంటుంది.
మూడోది… ఇన్నాళ్ళూ కాపీరైట్ భయంతో దూరంగా ఉన్న చాలా మంది క్రియేటర్లు ఇప్పుడు ధైర్యంగా డిస్నీ కంటెంట్‌తో వీడియోలు చేయగలుగుతారు.
మరి డిస్నీకి లాభం ఏమిటి?
ఇక్కడే అసలు బిజినెస్ ఉంది. ఈ రోజుల్లో యువత ముందు సినిమా ట్రైలర్ కంటే TikTokలో వైరల్ అయిన ఒక చిన్న వీడియో ఎక్కువ ప్రభావం చూపుతోంది. డిస్నీకి అది బాగా అర్థమైంది. అందుకే… ప్రేక్షకులు TikTokలో ఉన్నారంటే… డిస్నీ కూడా అక్కడికే వెళ్లాలని నిర్ణయించింది. అక్కడ వేలాది క్రియేటర్లు తమ సినిమాలకు ఉచిత ప్రచారం చేస్తారు. తమ సినిమాల్లోని ఒక మంచి సీన్…లక్షల మంది వీడియోల్లో కనిపిస్తే… అది కోట్ల రూపాయల మార్కెటింగ్ చేసినంత ప్రభావం చూపుతుంది. అంటే…ప్రకటనల కోసం డబ్బు ఖర్చు చేయకుండా… అభిమానులే ప్రచారకర్తలుగా మారిపోతారు.
మారింది టెక్నాలజీ కాదు… ఎకానమీ
ఈ వార్తలో కనిపించేది TikTok, డిస్నీ. కానీ…దాగి ఉన్నది Creator Economy. ఒకప్పుడు కంపెనీలు కంటెంట్ తయారు చేసేవి. ప్రేక్షకులు చూసేవారు. ఇప్పుడు… కంపెనీ కంటెంట్ ఇస్తుంది. ప్రేక్షకుడే దాన్ని కొత్త రూపంలో మార్చి ప్రపంచానికి చూపిస్తాడు. అంటే…ప్రేక్షకుడు ఇక వినియోగదారుడు మాత్రమే కాదు. అతడే మార్కెటింగ్ టీమ్. అతడే బ్రాండ్ అంబాసడర్. అతడే మీడియా.
ఇది ఇక్కడితో ఆగదు…
డిస్నీ ఈ అడుగు కాబట్టి రేపు Netflix కూడా ఇలాంటి మార్గంలో నడవొచ్చు. Warner Bros., Universal, Sony వంటి స్టూడియోలు కూడా క్రియేటర్లతో అధికారిక భాగస్వామ్యాలు ప్రారంభించే అవకాశం ఉంది. భవిష్యత్తులో…సినిమా విడుదలకు ముందు అభిమానులే రీల్స్ తయారు చేసే క్యాంపెయిన్లు రావచ్చు. OTTల్లో అభిమానుల వీడియోలకు ప్రత్యేక విభాగాలు రావచ్చు. వైరల్ అయిన క్రియేటర్లను సినిమాల ప్రచారంలో భాగం చేయవచ్చు. ఒక సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది ఇక రివ్యూలు మాత్రమే కాదు…ఎన్ని లక్షల మంది దానితో వీడియోలు చేశారు? అన్నది కూడా నిర్ణయించే రోజులు రావచ్చు.
చివరి మాట
ఒకప్పుడు ప్రపంచాన్ని సినిమాలు మార్చాయి.
ఇప్పుడు… 30 సెకన్ల వీడియోలు సినిమాల వ్యాపారాన్నే మార్చడం ప్రారంభించాయి.








