రాబోయే మహా సంక్షోభం… తేనెటీగతో మొదలవుతుందా?
— శివ దువ్వూరు
సాయంత్రం ఐదు గంటలు.
కోనసీమలోని ఒక మామిడి తోట. చెట్లన్నీ పూలతో నిండిపోయాయి. గోదావరి వైపు నుంచి వచ్చిన చల్లని గాలి నెమ్మదిగా వీచుతోంది. బయటకు చూస్తే అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ ఆ తోటలో ఏదో లేదు.ముఖంలో చిన్న సందేహం. ఆ సందేహం క్రమంగా ఆందోళనగా మారింది.
ఎందుకంటే ఈ సమయానికి ఆ తోట ఇలా ఉండదు. ప్రతి ఏడాది ఇదే కాలంలో ఈ పూల మధ్య గుయ్… గుయ్… అని తేనెటీగల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. చెట్టు నుంచి చెట్టుకు ఎగిరే చిన్న జీవులతో తోటంతా సందడిగా ఉంటుంది.
కానీ ఈ రోజు… గాలి ఉంది. పూలు ఉన్నాయి. పరిమళం ఉంది.సూర్యాస్తమయం కూడా ఉంది. లేనిది ఒక్కటే. అదే జీవం. ఆ తోటలో ఒక్క తేనెటీగ కూడా కనిపించలేదు. ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది.
ఎందుకంటే రైతుకు తెలుసు… పూలు పూయడం అంటే పంట వచ్చేసినట్టు కాదు. ఆ పువ్వును కాయగా, ఆ కాయను పండుగా మార్చే కనిపించని కార్మికులు ఉంటారు. వాళ్లే తేనెటీగలు. వాళ్లే ప్రకృతి నిశ్శబ్దంగా జీతం అడగకుండా పనిచేసే కూలీలు. వాళ్లు కనిపించకపోతే…ఈ రోజు చెట్టుపై పువ్వు ఉంటుంది.
రేపు కాయ ఉండదు. ఎల్లుండి పంట ఉండదు. ఆ తర్వాత రైతు చేతిలో డబ్బు ఉండదు. చివరికి… మీ డైనింగ్ టేబుల్‌పై పండు ఉండదు. ఆ క్షణంలో రైతు పూలను చూడడం లేదు. రాబోయే నెలల్లో తన పొలం ఎలా ఉంటుందో చూస్తున్నాడు. బహుశా… మన భవిష్యత్తును కూడా చూస్తున్నాడేమో.
ఒక తేనెటీగ కనిపించకపోవడం అంత పెద్ద విషయమా?
మనలో చాలామంది ఇదే ప్రశ్న అడుగుతారు. “ఒక కీటకం తగ్గితే ఏమవుతుంది?”, “ఒక పక్షి కనిపించకపోతే ప్రపంచమే ఆగిపోతుందా?”. అయితే ప్రకృతిలో ఏ జీవి ఒంటరిగా ఉండదు. ప్రతి జీవి మరో జీవితో, మరో మొక్కతో, మరో వ్యవస్థతో కనిపించని దారాలతో అనుసంధానమై ఉంటుంది.
తేనెటీగ పువ్వుపై వాలుతుంది. పువ్వు కాయగా మారుతుంది. కాయ పండుగా మారుతుంది. పండు మార్కెట్‌కు వస్తుంది. అక్కడి నుంచి మీ ఇంటికి చేరుతుంది. ఈ గొలుసులో ప్రధానమైన చిన్న లింక్ తెగిపోతే… చివరికి ప్రభావం పడేది మన భోజన పళ్లెంపైనే. అందుకే శాస్త్రవేత్తలు తేనెటీగలను కేవలం కీటకాలుగా చూడరు. ప్రపంచ ఆహార వ్యవస్థను నడిపే కనిపించని కార్మికులుగా చూస్తారు.
మనమే విలన్స్ మా?
భూమి మీద జీవం ప్రారంభమై దాదాపు 400 కోట్ల సంవత్సరాలు అయ్యింది. ఆ కాలంలో సముద్రాలు పుట్టాయి. అడవులు పెరిగాయి. డైనోసార్లు వచ్చి వెళ్లిపోయాయి. మంచు యుగాలు వచ్చాయి. ఖండాలు విడిపోయాయి. ఈ మహా చరిత్రలో మనిషి వచ్చింది కేవలం చివర్లో.
కానీ ఆ కొద్దికాలంలోనే మనం ప్రపంచాన్ని మనకు నచ్చినట్లు మార్చడం ప్రారంభించాం. అడవిని పొలంగా మార్చాం. పొలాన్ని నగరంగా మార్చాం. నదులను మళ్లించాం. కొండలను తవ్వేశాం. సముద్రాల్లో ప్లాస్టిక్ నింపేశాం. ఇది ఒక్కరోజులో జరగలేదు. ఆ ..ఒక చెట్టు నరికితే ఏమవుతుందిలే…ఒక చెరువు పూడ్చేస్తే ఏమవుతుందిలే… ఒక కొండను బ్రద్దలు కొడితే ఏమవుతుందిలే… అనే లక్షల చిన్న నిర్ణయాలు కలిసి… ఇప్పుడు ఒక గ్రహం ముఖచిత్రాన్నే మార్చేశాయి.
అంకెలు అబద్ధం చెప్పవు
భావోద్వేగం పక్కన పెడితే కూడా వాస్తవాలు ఆందోళన కలిగిస్తాయి. భూమిపై సుమారు 80 లక్షల జీవజాతులు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా. వాటిలో దాదాపు 10 లక్షల జాతులు అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. ప్రపంచంలోని 85 శాతం చిత్తడి నేలలు ఇప్పటికే కనుమరుగయ్యాయి. 1870లతో పోలిస్తే ప్రపంచంలోని పగడపు దిబ్బల్లో సగం ఇప్పుడు లేదు. గత యాభై సంవత్సరాల్లో ప్రపంచ వన్యప్రాణుల జనాభా సగటున 73 శాతం తగ్గిందని తాజా అంచనాలు చెబుతున్నాయి.
అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే… మనం పండించే అనేక ఆహార పంటలు పరాగసంపర్క జీవులపై ఆధారపడి ఉంటాయి. అంటే జీవ వైవిధ్యం క్షీణించడం అనేది పర్యావరణ సమస్య మాత్రమే కాదు. అది ఆర్థిక సమస్య. వ్యవసాయ సమస్య. ఆహార భద్రత సమస్య.
ఇది అమెజాన్ అడవుల కథ కాదు
“బయోడైవర్సిటీ” అంటే చాలా మందికి అమెజాన్ అడవులు, ఆఫ్రికా సవానాలు గుర్తుకొస్తాయి. కానీ మన ఇంటి చుట్టూ ఒకసారి చూడండి. చిన్నప్పుడు ఇంటి మేడపై పిచ్చుకలు గూళ్లు కట్టేవి. వాన పడితే కప్పల బెకబెకలు వినిపించేవి. రాత్రి మిణుగురు పురుగులు మెరిసేవి. గోదావరి ఒడ్డున పక్షుల గుంపులు ఎగిరేవి. ఇప్పుడు అవన్ని పూర్తిగా మాయమైపోలేదు. కానీ తగ్గిపోయాయి. ఆ తగ్గుదలే అసలు హెచ్చరిక. గుర్తు పెట్టుకోండి. ప్రకృతి ఒక్కసారిగా ఎప్పుడూ కూలిపోదు. ముందు నిశ్శబ్దమవుతుంది. తర్వాత ఖాళీ అవుతుంది.
చివరగా..
ఈ రోజు మీ ఇంట్లో పుట్టిన ఒక చిన్నారి… తన జీవితంలో మనం ఊహించని సాంకేతిక అద్భుతాలు చూస్తాడు. కానీ అదే చిన్నారి… తన తాత చెప్పిన పక్షుల కిలకిలారావం వినకపోవచ్చు. తన చిన్ననాటి కథల్లో ఉండే మిణుగురు పురుగులను నిజంగా చూడకపోవచ్చు.
అప్పట్లో డైనోసార్లను అంతం చేయడానికి ప్రకృతికి ఒక భారీ ఉల్క అవసరమైంది. ఈ రోజు లక్షల జీవజాతుల భవిష్యత్తును మార్చడానికి… ఒక బుల్డోజర్…ఒక కొత్త రహదారి… ఒక పూడ్చిన చెరువు…సరిపోతుంది. భూమికి మనిషి అవసరం లేకపోవచ్చు. కానీ మనిషికి… ఈ భూమి మీద ఉన్న ప్రతి చిన్న జీవితో అవసరం ఉంది.








