మీ ఫోన్… మీ మెదడులో ఏ మార్పులు తెస్తోందా తెలుసా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఫోన్ స్క్రీన్ ఒక్కసారి వెలిగింది.
ఒక నోటిఫికేషన్. వెంటనే ఇంకోటి. WhatsApp…Instagram… YouTube..
ఇలా వరస పెట్టి వస్తూనే ఉన్నాయి. దాంతో “ఒక్క నిమిషం చూసి పెట్టేద్దాం..” అనుకున్న ఫోన్ కాస్తా అరగంట తర్వాత కూడా చేతిలోనే ఉంది. అంతలో…ఎవరికో ఫోన్ చేయాలనుకున్నాం అందుకే తీసాం అని గుర్తు వచ్చింది. కానీ ఆ పేరు గుర్తు రావటం లేదు.
“బహుశా అలసిపోయానేమో…” అని మనలో మనమే అనుకుని లైట్ తీసుకుంటాం. అయితే ప్రపంచంలోని కొందరు శాస్త్రవేత్తలు మాత్రం దీనిని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ఎందుకంటే… వందేళ్లుగా మనిషి జనరేషన్ ..జనరేషన్ కు మరింత తెలివిగా మారుతున్నాడని నమ్మిన సైన్స్… ఇప్పుడు మొదటిసారి ఒక్కసారి డైలమోలో పడి ఒక ప్రశ్న అడుగుతోంది. మన మెదడు… నిశ్శబ్దంగా మారుతోందా? అని.
వందేళ్లుగా పైకే వెళ్లిన గ్రాఫ్… ఇప్పుడు ఎందుకు వెనక్కి తిరిగింది?
1900ల ప్రారంభంలో ఫ్రాన్స్‌లో రూపొందిన IQ పరీక్షలు తర్వాత అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించడం మొదలైంది. ఆ తర్వాత దాదాపు శతాబ్దం పాటు ఒకే ధోరణి కనిపించింది. ప్రతి కొత్త తరం… ముందు తరం కంటే సగటున కొంచెం ఎక్కువ IQ స్కోర్ సాధించింది. ప్రతి దశాబ్దానికి సుమారు మూడు పాయింట్ల చొప్పున ఈ పెరుగుదల నమోదైంది. ఈ ధోరణినే ప్రముఖ పరిశోధకుడు జేమ్స్ ఫ్లిన్ పేరు మీద “ఫ్లిన్ ఎఫెక్ట్” (Flynn Effect) అని పిలిచారు.
దీనికి మంచి పోషకాహారం, మెరుగైన విద్య, చిన్న కుటుంబాలు, క్లిష్టమైన సామాజిక వాతావరణం వంటి అనేక కారణాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. రోజు రోజుకీ అభివృద్ధి చెందుతున్న ప్రపంచంతో పాటు… ఈ గ్రాఫ్ కూడా ఇలాగే పైకి వెళ్తుందని అందరూ అనుకున్నారు.కానీ అలా జరగటం లేదు.
నాలుగు లక్షల మందిపై అధ్యయనం… సైన్స్ చెప్తున్న సత్యం
ఈ విషయాలని తేల్చాలనుకుంది అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన సోషల్ సైంటిస్ట్ ఎలిజబెత్ డ్వోరాక్ నేతృత్వంలోని టీమ్. 2006 నుంచి 2018 మధ్య సేకరించిన దాదాపు 3.94 లక్షల మంది పెద్దల కాగ్నిటివ్ టెస్ట్ డేటాను విశ్లేషించింది. 18 నుంచి 90 సంవత్సరాల మధ్య వయస్సు గల వారితో International Cognitive Ability Resource (ICAR) అనే ఓపెన్ సోర్స్ కాగ్నిటివ్ పరీక్షను పూర్తి చేశారు. ఒకే IQ స్కోర్‌ను కాకుండా… పరిశోధకులు వేర్వేరు మానసిక సామర్థ్యాలను విడివిడిగా పరిశీలించారు.
తార్కికంగా ప్యాటర్న్లు గుర్తించే సామర్థ్యం. సంఖ్యలు, అక్షరాల క్రమాన్ని అర్థం చేసుకునే లాజికల్ రీజనింగ్.
పదజాలం, భాషా అవగాహన. వస్తువులను మనస్సులో త్రిమితీయంగా ఊహించే స్పేషియల్ విజువలైజేషన్. వీటి ఫలితాలు పరిశోధకులనే ఆశ్చర్యపరిచాయి. మొత్తం కాగ్నిటివ్ స్కోర్లు తగ్గుతున్న సంకేతాలు కనిపించాయి.
మరీ ముఖ్యంగా తార్కిక ఆలోచన, సమస్యల పరిష్కారం, ప్యాటర్న్ గుర్తింపు వంటి విభాగాల్లో స్కోర్లు బాగా తగ్గిపోయాయి. 18 నుంచి 22 సంవత్సరాల యువతలో, అలాగే తక్కువ విద్యార్హత కలిగిన వారిలో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపించింది. ఈ మార్పునే పరిశోధకులు “రివర్స్ ఫ్లిన్ ఎఫెక్ట్” (Reverse Flynn Effect) కు అనుగుణమైన ధోరణిగా పేర్కొన్నారు.
అయితే… కథలో ఒక ట్విస్ట్ ఉంది
ఈ పరిశోధన…”మనుషులు ఒక్కసారిగా తెలివితక్కువవుతున్నారు” అని చెప్పడం లేదు. నిజానికి…ఒక సామర్థ్యం మాత్రం మెరుగుపడింది. అదే 3D స్పేషియల్ విజువలైజేషన్. వస్తువులను మనస్సులో తిప్పి చూడడం, త్రిమితీయంగా ఊహించడం వంటి సామర్థ్యాల్లో పాల్గొనేవారి స్కోర్లు పెరిగాయి. వీడియో గేమ్‌లు వంటి డిజిటల్ ఎక్సపీరియన్స్ లు దీనికి ఒక కారణం అయి ఉండవచ్చని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు.
అంటే…మన మెదడు బలహీనపడుతోందని కాదు. కొన్ని రకాల ఆలోచనా సామర్థ్యాలు తగ్గుతుంటే… మరికొన్ని కొత్త ప్రపంచానికి తగ్గట్టుగా మారుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
మరి తగ్గుతున్న సామర్థ్యాల వల్ల నష్టం ఏమిటి?
పరిశోధకులు గుర్తించిన ఆందోళనకరమైన విషయం ఏమిటంటే… తార్కిక ఆలోచన (Logical Reasoning), సమస్యల పరిష్కారం (Problem Solving), ప్యాటర్న్ గుర్తింపు (Pattern Recognition) వంటి విభాగాల్లో సగటు స్కోర్లు తగ్గడం జరిగింది.
ఇది ఆందోళన కలిగించేదేనా
ఓ రకంగా అంతే. ఎందుకంటే మన రోజువారీ జీవితంలో ప్రతి నిర్ణయానికి ఇవే పునాది. ఉదాహరణకు… నిజమైన వార్త ఏది? నకిలీ వార్త ఏది? అని గుర్తించడం తగ్గుతుంది. ఒక ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు లాభనష్టాలను బేరీజు వేయడం కష్టమవుతుంది. ఉద్యోగంలో కొత్త సమస్య ఎదురైతే పరిష్కారం కనుగొనడం కష్టమవుతుంది. ఒక తప్పు మళ్లీ మళ్లీ ఎందుకు జరుగుతోందో అందులోని ప్యాటర్న్‌ను గుర్తించడం కష్టం. AI లేదా సోషల్ మీడియాలో కనిపించే సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించడం చేయలేం.
3D సామర్థ్యం పెరగడం వల్ల మనకు ఉపయోగమేంటి?
తార్కిక ఆలోచన, సమస్యల పరిష్కారం వంటి కొన్ని విభాగాల్లో స్కోర్లు తగ్గినా… 3D స్పేషియల్ విజువలైజేషన్ మాత్రం మెరుగుపడింది. అంటే మనస్సులో వస్తువులను త్రిమితీయంగా ఊహించడం, ఒక వస్తువును అన్ని వైపుల నుంచి మానసికంగా “తిప్పి చూడడం” వంటి సామర్థ్యాలు బలపడుతున్నాయన్న మాట.
ఇది రోజువారీ జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది?
కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు మ్యాప్‌ను అర్థం చేసుకుని దారులు ఊహించుకోవడం. ఫర్నిచర్‌ను గదిలో ఎలా అమర్చితే బాగుంటుందో ముందుగానే ఊహించడం. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, డిజైన్, అనిమేషన్, 3D మోడలింగ్ వంటి రంగాల్లో పని చేయడం. డ్రైవింగ్ లేదా వీడియో గేమ్‌లలో వేగంగా విజువల్ నిర్ణయాలు తీసుకోవడం. అంటే… డిజిటల్ ప్రపంచం మన మెదడులోని కొన్ని విజువల్ నైపుణ్యాలను పదునుపెడుతుండొచ్చు.
కారణం స్మార్ట్ఫోనేనా?
వీటికి అన్నింటికి కారణం మన చేతిలోని స్మార్ట్ ఫోనేనా?.కానీ…ఈ పరిశోధన దానికి సమాధానం చెప్పలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల వినియోగం వేగంగా పెరగడం ప్రారంభమైనప్పటినుంచి అని మాత్రం అని చెప్పింది.
ఇది యాదృచ్ఛికమా… లేక సంబంధం ఉందా?
బ్రిటన్‌కు చెందిన కాలమిస్ట్ జేమ్స్ మారియట్ అభిప్రాయం ప్రకారం, ప్రింట్ పుస్తకాలు మనల్ని ఒక ఆలోచనను మొదటి నుంచి చివరి వరకు తార్కికంగా అనుసరించేలా చేస్తాయి.కానీ…సోషల్ మీడియా, షార్ట్ వీడియోలు సమాచారాన్ని చిన్న చిన్న ముక్కలుగా అందిస్తాయి. ఆలోచించే విధానంపైనా ఇది ప్రభావం చూపుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ కథ కేవలం అమెరికా గురించే కాదు…
ఒక్కసారి మన చుట్టూ చూడండి. బస్సు కోసం ఎదురు చూస్తున్నవాళ్లు…రైలులో ప్రయాణిస్తున్నవాళ్లు… ఇంట్లో భోజనం చేస్తున్న కుటుంబం…ఎక్కడ చూసినా చేతిలో ఫోన్. పిల్లలు మాత్రమే కాదు. పెద్దవాళ్లూ అలాగే. ఏ చిన్న సందేహం వచ్చినా Google. ఏదైనా రాయాలన్నా AI. ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకోవడం లేదు. దారులు గుర్తుపెట్టుకోవడం లేదు. సమాచారం మొత్తం మన జేబులో ఉంది. అయితే ఆ సమాచారాన్ని లోతుగా అర్థం చేసుకునే సమయం మాత్రం మనం మన మెదడుకు ఇస్తున్నామా? అదే ప్రశ్న ఈ పరిశోధన పరోక్షంగా మన ముందుంచుతోంది.
AI యుగంలో అసలు తెలివి అంటే ఏమిటి?
2026లో సమాచారానికి కొరత లేదు. ఒక ప్రశ్న అడిగితే AI సమాధానం చెబుతుంది. Google సెకన్లలో సమాచారం చూపిస్తుంది. AI సమాధానం ఇవ్వగలదు. ప్రశ్న ఎలా అడగాలో మాత్రం మన మెదడే నిర్ణయిస్తుంది. భవిష్యత్తులో ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకున్న వ్యక్తి కాదు…సమాచారంలో నిజం ఏది, అబద్ధం ఏది, ఉపయోగకరమైనది ఏది అని గుర్తించగలిగిన వ్యక్తే నిజంగా తెలివైనవాడిగా మారే అవకాశం ఉంది.
ఇక్కడ తేలిందేమిటంటే…
ఈ జనరేషన్ లో మనిషి తెలివి మాయమవడం లేదు.కానీ… అది రూపం మార్చుకుంటోంది. ఒకప్పుడు మన తాతలు ఉపయోగించిన మెదడు… ఈ రోజు మనం ఉపయోగిస్తున్న మెదడు…రేపు మన పిల్లలు ఉపయోగించే మెదడు… మూడు ఒకేలా ఉండకపోవచ్చు. అది కొంత లాభం..బోలెడంత నష్టం కూడాను.








