మెగాస్టార్ చిరంజీవితో ప్రభుత్వ మెగా ప్లాన్! సెట్ అయితే సూపర్
—సూర్య ప్రకాష్ జోశ్యుల
“ఒక రాష్ట్రాన్ని ప్రపంచం గుర్తుపట్టాలంటే… మ్యాప్ సరిపోవచ్చు..కానీ గుర్తుంచుకోవాలంటే..? ఒక ముఖం కావాలి.”
ఒకప్పుడు రాష్ట్రాల మధ్య పోటీ అంటే ఎవరి దగ్గర పెద్ద పోర్టు ఉంది… ఎవరి దగ్గర ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి… ఎవరి దగ్గర మంచి రోడ్లు ఉన్నాయి… అన్నదే. ఇప్పుడు గేమ్ మారిపోయింది. ఇప్పుడు పోటీ అటెన్షన్ కోసం. ప్రపంచం మీ వైపు ఒక్కసారి తిరిగి చూడాలంటే కాంక్రీట్ కంటే కథ బలంగా ఉండాలి. మ్యాప్ కంటే గుర్తుండిపోయే ఒక ముఖం గొప్పగా ఉండాలి. ఎందుకంటే అదే వ్యాపారం. అదే టూరిజం.అలాంటి ఆలోచనను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోందని తెలుస్తోంది. ఏమిటా వార్త.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మెగాస్టార్ చిరంజీవిని రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించే ప్రతిపాదనపై ప్రభుత్వం కీలక స్థాయిలో చర్చలు జరుపుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వినికిడి. ఈ వార్త పైకి సాధారణ రాజకీయ నిర్ణయంలా కనిపించినా… దాని వెనుక ఉన్న ఆలోచన మాత్రం చాలా పెద్దది.
చిరంజీవే ఎందుకు ? ఇప్పుడా అవసరం ఏమిటి
ఆ ప్రశ్నలకు సమాధానం సినిమా ప్రపంచంలో లేదు. మార్కెటింగ్ ప్రపంచంలో ఉంది. ప్రపంచ బిజినెస్ స్కూళ్లలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో ఒకటి Face Economy. వినడానికి కొత్తగా అనిపించినా, దీని లాజిక్ చాలా సింపుల్. ఈ రోజుల్లో మనిషి ఒక రోజులో వేల ప్రకటనలు చూస్తాడు. కానీ అతని మెదడు గుర్తుంచుకునేది మాత్రం వాటిలో చాలా తక్కువ. అందులో కూడా తనకు బాగా తెలుసున్న, నమ్మకం ఉన్న ఒక ముఖం కనిపిస్తే… అక్కడే ఆగిపోతాడు. అందుకే ఇప్పుడు దేశాలు, రాష్ట్రాలు కూడా తమకంటూ ఒక “ఫేస్” కోసం వెతుకుతున్నాయి.
దీనికి భారతదేశంలోనే ఒక క్లాసిక్ ఉదాహరణ ఉంది.
ఒకప్పుడు “గుజరాత్” అంటే చాలామందికి పరిశ్రమలు, వ్యాపారమే గుర్తొచ్చేది. కానీ అమితాబ్ బచ్చన్ “కుచ్ దిన్ తో గుజారో గుజరాత్ మే” అని పిలిచిన తర్వాత… అదే రాష్ట్రం పర్యాటక మ్యాప్‌లో కొత్త కథ రాసుకుంది. ఒక మనిషి గొంతు… ఒక రాష్ట్ర కథను మార్చగలదని అప్పుడే దేశం చూసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే దారిలో ఆలోచిస్తోందా అనిపిస్తోంది.
మరో ఆసక్తికరమైన కాన్సెప్ట్ , అదే Trust Transfer.
మన పెద్దలు ఒక మాట చెప్పేవారు… “నమ్మకం ఒక్క రోజులో పుట్టదు… కానీ పుట్టాక దానికి విలువ ధరతో కొలవలేం.” మార్కెటింగ్ కూడా ఇదే చెబుతుంది. ప్రజలు ఒక వ్యక్తిని నమ్మితే… అతను చెప్పే కథను,మాటలను కూడా నమ్మే అవకాశాలు ఎక్కువ. అదే నమ్మకాన్ని ఒక బ్రాండ్, ఒక సంస్థ, ఒక రాష్ట్రం మీదకు తీసుకురావడాన్నే మార్కెటింగ్ భాషలో Trust Transfer అంటారు.
చిరంజీవి విషయంలో ఈ సైకాలజీ పనిచేస్తుందని ప్రభుత్వం భావిస్తోందా? సమాధానం అధికారిక ప్రకటన తర్వాతే తెలుస్తుంది. కానీ ఈ చర్చ మాత్రం ఇప్పటికే మొదలైంది. అందరూ అనుకుంటున్నట్లు ఇది కేవలం ప్రకటనల కథ కూడా కాదు. ఇది Celebrity Diplomacy.
ఒకప్పుడు దేశాలు తమ శక్తిని,సత్తాని యుద్ధ విమానాలతో చూపించేవి. ఇప్పుడు సంస్కృతితో చూపిస్తున్నాయి. దక్షిణ కొరియా K-Popతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. జపాన్ యానిమేతో కోట్లాది అభిమానులను సంపాదించింది. థాయ్‌లాండ్ తన వంటకాలతో ఒక ప్రత్యేక బ్రాండ్‌గా మారింది. దీనినే ప్రపంచం ఇప్పుడు Soft Power అంటోంది. తుపాకీతో కాదు… సంస్కృతితో ప్రభావం చూపించడం.
ఆ కోణంలో చూస్తే చిరంజీవి కేవలం ఒక సినీ నటుడు కాదు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రజల ఊహల్లో, జ్ఞాపకాల్లో, భావోద్వేగాల్లో ఉన్న ఒక కల్చరల్ ఐకాన్.
అలాగే ఆంధ్రప్రదేశ్ దగ్గర చెప్పటానికి,మాట్లాడటానికి చాలా విషయాలు ఉన్నాయి. అరకులో ఉదయం పొగమంచు అద్బుతంగా ఉంటుంది. పాపికొండల్లో గోదావరి శ్వాస ఉంది. గండికోట రాతిలో చరిత్ర ఉంది. లేపాక్షి శిల్పాల్లో కళ ఉంది. వందల కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. బౌద్ధ వారసత్వం ఉంది.అదీ ఇదీ అని ఏమీ లేదు..దాదాపు అన్నీ ఉన్నాయి.అయితే అవి ఉన్నాయని చెప్పేవారే లేరు.
“ఉన్నదంతా బంగారమే… కానీ చూపించే చేయి కూడా ఉండాలి” అన్నట్టుగా, ఈ కథలన్నింటినీ ఒకే బ్రాండ్ కథగా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం మాత్రం ఇప్పటివరకు బలంగా కనిపించలేదు. బహుశా ఆ లోటును భర్తీ చేయాలనే ఆలోచనే ఈ ప్రతిపాదన వెనుక ఉండొచ్చు.
ఇది కేవలం టూరిజం కోసం తీసుకునే నిర్ణయం అని అనుకోవడం కూడా పొరపాటే. ఒక రాష్ట్రానికి బలమైన బ్రాండ్ ఇమేజ్ ఏర్పడితే, పర్యాటకులు మాత్రమే కాదు… పెట్టుబడిదారులు కూడా ఆ రాష్ట్రాన్ని మరోసారి గమనిస్తారు. అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పెరుగుతుంది. వ్యాపార చర్చల్లో ఆ రాష్ట్రం పేరు వినిపించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఈ రోజుల్లో అభివృద్ధి అనేది కేవలం భవనాలు కట్టడం కాదు… Perception కూడా నిర్మించడం.
ఒకప్పుడు తన సినిమాలతో కోట్లాది మందిని థియేటర్లకు రప్పించిన పేరు మెగాస్టార్… ఇప్పుడు అదే పేరు ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచ దృష్టిని తిప్పగలదా? అనేది కాలం చెప్పాల్సిన విషయం. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇది కేవలం చిరంజీవికి ఒక పదవి ఇవ్వడం కాదు.
“ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచం ఎలా గుర్తుంచుకోవాలి?” అనే ప్రశ్నకు ప్రభుత్వం వెతుకుతున్న సమాధానం కావచ్చు.








