క్రీడాకారులకు అవసరమైన సంపూర్ణ మద్దతు అందిస్తాం : మంత్రి లోకేష్
భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ
ఏపీ స్పోర్ట్స్ విజన్ సాకారంలో సింధు సహకారం కావాలి
తల్లిదండ్రులు తమ పిల్లలు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ భూమిపూజ కార్యక్రమంలో మంత్రి లోకేష్
విశాఖపట్నం: వేలాదిమంది భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ నిలుస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణ పనులకు భూమిపూజ అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడారు.
భారతదేశపు గొప్ప క్రీడాకారిణిగా పీవీ సింధు గుర్తింపు పొందారు
ఎన్నో సంవత్సరాల క్రితం భారత జట్టు జెర్సీ ధరించాలని కలలు కన్న ఒక చిన్నారి ఉండేది. ప్రతి ఉదయం హైదరాబాద్ నగరం ఇంకా నిద్రలోనే ఉండగా… ఆమె అప్పటికే కోర్టులో సాధన ప్రారంభించేది. సాధన చేసేది. పాఠశాలకు వెళ్లేది. తిరిగొచ్చి మళ్లీ సాధన చేసేది. అప్పుడు కెమెరాలు లేవు, వార్తల్లో ఆమె పేరు లేదు, పతకాలు కూడా లేవు. ఉన్నది ఒక్కటే… క్రమశిక్షణ, త్యాగం. నిన్నటి కంటే ఈ రోజు మరింత మెరుగ్గా మారాలనే అచంచల సంకల్పం. ఈ రోజు ప్రపంచమంతా ఆమెను ఒలింపిక్ పతక విజేతగా, ప్రపంచ ఛాంపియన్‌గా, భారతదేశపు అత్యంత గొప్ప క్రీడా దిగ్గజాల్లో ఒకరిగా గుర్తిస్తోంది. మనం గర్వంగా ఆమెను మన సోదరి పీవీ సింధు అని పిలుస్తున్నాం.
పీవీ తల్లిదండ్రుల త్యాగం ఎనలేనిది
ప్రజలు పతకాన్ని చూస్తారు. కానీ ఆ పతకం వెనుక ఉన్న ప్రయాణాన్ని ఎప్పుడూ చూడరు. ప్రతి ఛాంపియన్ వెనుక ఎదురు చూసిన ఒక తల్లి ఉంటుంది. నమ్మకం కోల్పోని ఒక తండ్రి ఉంటారు. ఎప్పుడూ వెనుకంజ వేయని ఒక కోచ్ ఉంటారు. ఈ రోజు పీవీ రమణ గారికి, శ్రీమతి పి. విజయ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఒలింపిక్ పతకాలు గెలవలేదు. కానీ భారతదేశానికి ఒక ఒలింపిక్ ఛాంపియన్‌ను అందించారు. అలాగే ప్రతి కోచ్‌కు కూడా నా వందనం. ఎందుకంటే ఛాంపియన్లు ఒక్క రాత్రిలో తయారు కారు. వారిని సహనం, క్రమశిక్షణ, అచంచల విశ్వాసంతో తీర్చిదిద్దుతారు.
వేలాదిమంది భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదిక పీవీ సింధు అకాడమీ
కొన్ని వారాల క్రితం వివిధ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారులందరినీ కలిసే అవకాశం నాకు లభించింది. ఆ సాయంత్రం సింధు కూడా ఎంతో ఆప్యాయంగా మాతో కలిసి విందులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె చెప్పిన ఒక మాట నా మనసులో బలంగా నిలిచిపోయింది. తాను ఇప్పుడు 19 ఏళ్ల యువ క్రీడాకారిణిని కాదని అన్నారు. ఆ మాట నన్ను ఎంతో ఆలోచింపజేసింది. ఎందుకంటే.. ఆమె లక్ష్యం ఇప్పుడు కేవలం పతకాలు గెలవడమే కాదు. తాను చేసిన ఈ ప్రయాణాన్ని, తాను పొందిన అనుభవాన్ని ఎలా ఒక వ్యవస్థగా రూపుదిద్దాలి, వాటిని తర్వాతి తరాలకు ఎలా అందించాలన్నదే ఆమె ఆలోచన. తన లెగసీని ఎలా కొనసాగించాలి, తన నుంచి ప్రేరణ పొందిన తరతరాల క్రీడాకారులు ఎదగాలంటే ఏం చేయాలనే దిశగా ఆమె ఆలోచిస్తున్నారు. ఆ స్ఫూర్తితోనే విశాఖపట్నంను క్రీడా రంగంలో ఒక గొప్ప కేంద్రంగా మార్చగలమనే విశ్వాసం ఆమెకు ఉంది. అందుకే ఈ రోజు వారందరూ మీ అందరి ముందుకు వచ్చి నిలబడ్డారు.
ఈ రోజు మనం కేవలం ఒక భవనానికి శంకుస్థాపన చేయడం లేదు. వేలాదిమంది భవిష్యత్ ఛాంపియన్ల జీవిత ప్రయాణానికి తొలి అధ్యాయాన్ని లిఖిస్తున్నాం. బహుశా తదుపరి ఒలింపిక్ ఛాంపియన్ ఇక్కడే మన మధ్య కూర్చుని ఉండవచ్చు. తాను ఒక రోజు ప్రపంచ వేదికపై నిలుస్తానని ఆ చిన్నారికే ఇంకా తెలియకపోవచ్చు. ఆ సామర్థ్యాన్ని గుర్తించే అవకాశం ఆ చిన్నారికి కల్పించడం మనందరి బాధ్యత.
పీవీ సింధు వ్యక్తిగత కల అందరి కలగా మారింది
ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడా దేశాలన్నింటిలో ఒక విషయం మాత్రం కామన్ గా కనిపిస్తుంది. వారు ఛాంపియన్లు జన్మించాలని ఎదురుచూడరు. ఛాంపియన్లు తయారయ్యే వాతావరణాన్ని సృష్టిస్తారు. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్‌ను నిర్మించింది. ఖతార్ ప్రపంచ ప్రఖ్యాత అస్పైర్ జోన్‌ను అభివృద్ధి చేసింది. ఇండియా ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థలు తమ దేశాలకు గర్వకారణమైన అనేక మంది క్రీడాకారులను తీర్చిదిద్దాయి. ఎందుకంటే గొప్ప దేశాలకు ఒక సత్యం తెలుసు. ఒలింపిక్ పతకాలను క్రీడాకారులు గెలుస్తారు, కానీ ఒలింపిక్ కలలకు పునాది వేసేది సంస్థలే. ఈ అకాడమీ కూడా ఒక కలతోనే ప్రారంభమైంది. అది సింధు హృదయానికి ఎంతో దగ్గరైన ఒక కల. కానీ ఆ కలను ఆమె మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారితో పంచుకున్నప్పుడు, ఆయన ఆమెను కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే ఎందుకని ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు. ప్రతి క్రీడలోని పిల్లలు నేర్చుకునేలా, శిక్షణ పొందేలా, అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా ఒక కేంద్రాన్ని ఎందుకు నిర్మించకూడదని ప్రశ్నించారు. ఆ ఒక్క ప్రశ్న అన్నింటినీ మార్చేసింది. ఒక వ్యక్తిగత కల అందరి కలగా మారింది. ఒక భాగస్వామ్య దార్శనికతగా రూపుదిద్దుకుంది.
అన్ని రకాల క్రీడలకు నిలయంగా పీవీ సింధు అకాడమీ
ఒక భవనాన్ని నిర్మించడం, ఒక శాశ్వత వారసత్వాన్ని నిర్మించడం మధ్య ఉన్న తేడా అదే. ఈ రోజు ఇది కేవలం ఒక బ్యాడ్మింటన్ అకాడమీ మాత్రమే కాదు. ఇది బ్యాడ్మింటన్‌కు, స్విమ్మింగ్‌కు, జిమ్నాస్టిక్స్‌కు, షూటింగ్‌కు, వెయిట్లిఫ్టింగ్కు, బాస్కెట్‌బాల్‌కు, ఫుట్‌బాల్‌కు వేదికగా నిలవనుంది. అంకితభావంతో ఈ గడప దాటి లోపలికి అడుగుపెట్టి, జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యంతో బయటకు వచ్చే ప్రతి యువ క్రీడాకారుడికి ఒక నిలయంగా నిలుస్తుంది. క్రీడలపై మక్కువతో ఈ ప్రాంగణంలో అడుగుపెట్టే ప్రతి యువ క్రీడాకారుడు స్పష్టమైన లక్ష్యం, ఆత్మవిశ్వాసంతో బయటకు వెళ్లేలా తీర్చిదిద్దడమే మా సంకల్పం. ఈ దార్శనికతకు ప్రతిరూపంగానే ఈ క్యాంపస్‌లో ప్రతిపాదించిన మల్టీ-స్పోర్ట్స్ సెంటర్ రూపుదిద్దుకుంటోంది.
భవిష్యత్ ఛాంపియన్ల గమ్యస్థానంగా ఏపీ నిలుస్తుంది
ఇన్నేళ్లుగా భారతదేశ యువ క్రీడాకారులు ప్రపంచంలోని గొప్ప క్రీడా సంస్థల్లో శిక్షణ పొందేందుకు విదేశాల వైపు చూశారు. భారతదేశం నలుమూలల నుంచి యువ క్రీడాకారులు.. తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందమైన విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న పీవీ సింధు సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందాలని కోరుకుంటున్నామని చెప్పే రోజు కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆ రోజు వచ్చినప్పుడు నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఎందుకంటే, అప్పటికి ఆంధ్రప్రదేశ్ కేవలం ఛాంపియన్లను తయారు చేసే రాష్ట్రంగా మాత్రమే కాకుండా, భవిష్యత్ ఛాంపియన్లు తమ కలలను సాకారం చేసుకోవడానికి దేశం మొత్తం నుంచి వచ్చే గమ్యస్థానంగా కూడా గుర్తింపు పొందుతుంది.
భవిష్యత్ తరాలకు పీవీ సింధు బాసటగా నిలుస్తున్నారు
భారతదేశానికి ఎన్నో పతకాలు అందించినందుకు మాత్రమే కాకుండా భవిష్యత్ తరానికి తిరిగి అందించాలనే గొప్ప సంకల్పాన్ని ఎంచుకున్నందుకు పీవీ సింధుకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ మహత్తర దార్శనికతను సాకారం చేయడానికి అంకితభావంతో కృషి చేస్తున్న దత్తా గారిని కూడా అభినందిస్తున్నాను. అలాగే ఈ అకాడమీ ఒకే క్రీడకు పరిమితం కాకుండా, ఒకే క్రీడాకారుడి వరకే ఆగిపోకుండా, ఒకే తరం వరకే పరిమితం కాకుండా, విస్తృత దార్శనికతతో ముందుకు సాగేందుకు ప్రోత్సహించిన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదే నిజమైన నాయకత్వం.
విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం
ప్రతి చిన్నారి డాక్టర్ కాలేడు, ప్రతి చిన్నారి ఇంజనీర్ కాలేడు. ప్రతి చిన్నారి శాస్త్రవేత్త కాలేడు. అలాగే ప్రతి చిన్నారి ఒలింపియన్ కూడా కాలేడు. కానీ ప్రతి చిన్నారి ఒక ప్రత్యేకమైన ప్రతిభతోనే జన్మిస్తుంది. ప్రతి చిన్నారిలో దాగి ఉన్న సహజ ప్రతిభను గుర్తించేందుకు దోహదపడటం ఒక మంచి విద్యా వ్యవస్థ, ఒక మంచి ప్రభుత్వ బాధ్యత. అదే మా నిబద్ధత. విద్యాశాఖ మంత్రిగా విద్య, క్రీడలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నాం. తరగతి గది జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఆటస్థలం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. తరగతి గది ఎలా ఆలోచించాలో నేర్పుతుంది. ఆటస్థలం. ఎలా పోరాడాలో నేర్పుతుంది. ఈ రెండూ ముఖ్యమైనవే. అందుకే మన పాఠశాలల్లో నో బ్యాగ్ డేను ప్రవేశపెట్టాం. ఎందుకంటే జీవితంలో అత్యంత విలువైన కొన్ని పాఠాలు బల్ల ముందు కూర్చొని నేర్చుకోలేం. అవి ఆటస్థలంలోనే నేర్చుకుంటాం.
క్రీడల వల్ల క్రమశిక్షణ అలవడుతుంది
క్రీడలు కేవలం పతక విజేతలను మాత్రమే తయారుచేయవు. మంచి వ్యక్తిత్వం కలిగిన మనుషులను కూడా తీర్చిదిద్దుతాయి. విజయానికి ముందు క్రమశిక్షణను నేర్పుతాయి. విజయానికి ముందు ప్రత్యర్థుల పట్ల గౌరవాన్ని నేర్పుతాయి. విజయం తర్వాత వినయాన్ని నేర్పుతాయి. ఓటమి తర్వాత మళ్లీ లేచి నిలబడే ధైర్యాన్ని నేర్పుతాయి. అందుకే ప్రతి చిన్నారి తప్పకుండా ఒక క్రీడను ఆడాలి. ప్రతి చిన్నారి పతకం గెలిచినా, గెలవకపోయినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం తప్పకుండా గెలుచుకుంటారు.
ఏపీ స్పోర్ట్స్ విజన్ సాకారంలో సింధు సహకారం కావాలి
ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా రంగానికి సంబంధించి మా విజన్‌ను సాకారం చేయడంలో సింధు సహకారం ఎంతో అవసరం. మహిళల క్రీడాభివృద్ధి కోసం ఎలా ముందుకు సాగాలనే అంశంపై మేం ఇప్పటికే పనిచేస్తున్నాం. మరింత మంది బాలికలు, మహిళలు క్రీడల్లోకి రావాలంటే ఏం చేయాలనే దానిపై దృష్టి సారిస్తున్నాం. అది అంత సులభం కాదని తెలుసు. మీ తండ్రి వాలీబాల్ క్రీడాకారుడు కావడంతో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి ప్రోత్సహించారు. కానీ ప్రతి బాలికకు అలాంటి ప్రోత్సాహం లభించదు. అందుకే, ముఖ్యంగా బాలికలు క్రీడల్లో రాణించేలా వారికి అనుకూలమైన వాతావరణం, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ నిర్మించడం అత్యంత అవసరం. ఆ మార్పునకు సింధు ఒక కీలక ప్రేరణగా ఒక్కరికి మాత్రమే కాదు, తరతరాల మహిళలకు స్ఫూర్తినిస్తూ, క్రీడలను కూడా ఒక గొప్ప వృత్తి అవకాశంగా చూడగలిగేలా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. అందుకే, సమగ్ర క్రీడా విధానంతో పాటు బలమైన స్పోర్ట్స్ ఎకో సిస్టం నిర్మించడంలో మీతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను.
యువ క్రీడాకారులకు అవసరమైన సంపూర్ణ మద్దతు అందిస్తాం
ఏపీ క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తాం. మీకు ఎప్పుడైనా, ఏ సహాయం అవసరమైనా మా తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. శాప్ ఛైర్మన్ రవి నాయుడు విశ్వవిద్యాలయ రాజకీయాల నుంచి వచ్చినప్పటికీ, క్రీడల ప్రాముఖ్యతను, మా గౌరవ ముఖ్యమంత్రి గారి దూరదృష్టిని బాగా అర్థం చేసుకున్నారు. అందువల్ల, మీకు అవసరమైన ప్రతి సహాయానికి మేం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఏ చిన్నారి కూడా అవకాశం లేకపోవడం వల్ల తన ప్రతిభను కోల్పోకూడదని మేం బలంగా విశ్వసిస్తున్నాం. అందుకే మేం మీ వెన్నంటే ఉంటాం. ప్రపంచాన్ని జయించండి. ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలవండి. భారతదేశానికి కీర్తి తీసుకురండి.
ప్రతి మెడల్ వెనుక తల్లిదండ్రుల త్యాగం, కోచ్ అంకితభావం దాగి ఉంటాయి
ఇక్కడ ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచం ఒక ఛాంపియన్‌ను చూసే ముందు.. తల్లిదండ్రులు తమ బిడ్డలోని కలను చూస్తారు. ప్రతి కోచ్‌కు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు కేవలం ఒక క్రీడను మాత్రమే బోధించరు. ఆత్మవిశ్వాసాన్ని నిర్మిస్తారు. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతారు. కొన్నిసార్లు ఒక జీవితాన్నే మలుస్తారు. ప్రతి మెడల్ పై ఒక క్రీడాకారుడి పేరు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ ప్రతి పతకం వెనుక ఒక కుటుంబం చేసిన త్యాగం, ఒక కోచ్ అంకితభావం దాగి ఉంటాయి.
గొప్ప క్రీడాకారులను తీర్చిదిద్దే రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందాలి
నా డ్రీమ్ చాలా సింపుల్. ఆంధ్రప్రదేశ్ గొప్ప విద్యార్థులను తయారు చేసే రాష్ట్రంగా మాత్రమే కాకుండా, గొప్ప పరిశ్రమలను నిర్మించే రాష్ట్రంగా మాత్రమే కాకుండా, గొప్ప క్రీడాకారులను తీర్చిదిద్దే రాష్ట్రంగా కూడా గుర్తింపు పొందాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ప్రతి పాఠశాల క్రీడలను ఒక పండుగలా జరుపుకోవాలి. ప్రతి ఆడపిల్ల ఆత్మవిశ్వాసంతో ఆటస్థలంలో అడుగుపెట్టాలి. ప్రతి చిన్నారి సింధు చేయగలిగితే… నేను కూడా చేయగలననే నమ్మకంతో ముందుకు సాగాలి. ఒక రోజు, ఒక చిన్నారి ఈ అకాడమీ గేటు దాటి… ఆశ అనే ఒకే ఒక్క సంపదతో లోపలికి అడుగుపెడతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే చిన్నారి త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి ఒలింపిక్ స్టేడియంలోకి అడుగుపెట్టవచ్చు. ప్రపంచం ఆ పతకాన్ని చూసి సంబరాలు చేసుకుంటుంది. భారతదేశం ఆ విజయాన్ని చూసి గర్విస్తుంది. కానీ ఆ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో మనం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ఒక కలతో, నమ్మకంతో నిలిచిన ఒక కుటుంబంతో, దారిచూపిన కోచ్‌లతో, అవకాశాలను సృష్టించిన ఒక ప్రభుత్వంతో చిన్నగా ఆలోచించడానికి ఎప్పుడూ నిరాకరించిన ఒక అకాడమీతో ఆ ప్రయాణం ఇక్కడే ప్రారంభమైంది. పీవీ సింధుకు, దత్తా గారికి, పీవీ రమణ గారికి, శ్రీమతి పి.విజయ గారికి, ప్రతి కోచ్‌కు, ప్రతి ఆర్కిటెక్ట్‌కు, ఈ మహత్తర దార్శనికతను సాకారం చేయడానికి తోడ్పడిన ప్రతి భాగస్వామికి, తమవంతు కృషిచేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు.
కేవలం అకాడమీకీ కాదు.. దేశ భావి ఛాంపియన్లకు పునాది వేశాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మన పిల్లలకు, పెద్ద కలలు కనే అవకాశాన్ని కల్పించే, మెరుగైన శిక్షణ పొందే అవకాశాన్ని అందించే, మరింత ధైర్యంగా పోటీ పడే వేదికను కల్పించే, భారతదేశానికి గర్వకారణంగా నిలిచే ప్రతి కార్యక్రమానికి మేం ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని మీకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మనం కేవలం ఒక క్రీడా అకాడమీకి శంకుస్థాపన చేయలేదు. భారతదేశ భావి ఛాంపియన్లకు బలమైన పునాదిని వేశాం. ఒక ఛాంపియన్ గొప్ప వారసత్వం అతని మెడలో వేలాడే పతకం కాదు, ఒక చిన్నారి హృదయంలో వెలిగించే కల అని మంత్రి చెప్పారు.








