జగన్ శ్రీకాకుళం పర్యటన రగడ.. ఆగని అరెస్ట్ లు..!
శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) పర్యటనలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, పోలీసులపై దౌర్జన్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జులై 30న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణను తీవ్రతరం చేస్తూ.. తాజాగా విశాఖపట్నంలో(Vizag) వైసీపీ నేత అన్నెపు సంజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపులు చేపట్టిన పోలీసులు, పక్కా సమాచారంతో వైజాగ్‌లో సంజయ్ కుమార్‌ను అరెస్ట్ చేసి శ్రీకాకుళానికి తరలించారు.
గత నెల జులై 30వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా అంపోలు ప్రాంతంలో వైసీపీ శ్రేణులు, నేతలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర వాగ్వాదానికి దిగడమే కాకుండా, బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఉద్రిక్తతల సమయంలో విధుల్లో ఉన్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్ ప్రవల్లికను కొందరు వైసీపీ నేతలు చుట్టుముట్టి, నెట్టివేస్తూ అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి.
బాధిత మహిళా ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమదాలవలస పోలీసులు వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి చింతాడ రవికుమార్‌తో పాటు దాదాపు 20 మందిపై హత్యాయత్నం సహా పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును ప్రభుత్వం మరియు పోలీసు ఉన్నతాధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితులు పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా వైజాగ్‌లో అన్నెపు సంజయ్ కుమార్ పట్టుబడగా.. మిగిలిన ప్రధాన నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.








