ఇరానీయుల బతుకు వ్యథా భరితం.. వస్తువులు అమ్ముకుని జీవనం..!
పశ్చిమాసియా సంక్షోభం ప్రజలకు తీరనిశాపంలా పరిణమిస్తోంది. మరీ ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అట్టుడుకుతోంది. అయినా ఇరాన్ హైకమాండ్ తన మొండిపట్టుదల వీడడం లేదు. ఫలితంగా అక్కడి ప్రజల బతుకు దుర్భరంగా మారింది. బయటకు వెళ్లి పనిచేసే వీలు లేదు.. బయటకు వెళితే ప్రాణాలు మిగిలే ఛాన్స్ లేదు. దీంతో అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ.. పనిచేయకుంటే జీవనం గడిచేదెలా.. ? దీంతో ఇంటిలోని వస్తువులు అమ్మడం, అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నారు ఇరానీయులు.
జుత్తు, దుస్తులు, బూట్లు, వాడిన సెంటు సీసాలను విక్రయానికి పెడుతున్నారు. కొంత మంది తమ ల్యాప్టాప్లను అద్దెకు ఇస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. ఇటువంటి వాటితో ఆన్లైన్ క్లాసిఫైడ్లు భారీగా పెరిగాయి. ధరలు పెరగడంతో ప్రతి రియాల్ ఇప్పుడు ఇరానియన్లకు ఎంతో ముఖ్యంగా మారింది.
ఇరాన్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. జులై ఆఖరునాటికి అది 66శాతానికి చేరుకుంది. అంటే లగ్జరీ వస్తువులే కాకుండా నిత్యావసరాల ధరలూ చుక్కలు చూపిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఆహార ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది.
అమెరికా , ఇజ్రాయెల్ ఎప్పుడు శాంతిస్తాయో తెలియదు. కానీ వారి భీకర దాడులు తమ జీవితాల్ని చిన్నాభిన్నం చేశాయని ఇరానియన్లు వాపోతున్నారు. పోనీ సర్కార్ ను నిలదీసే ధైర్యముందా అంటే అదీ లేదు. దీంతో తమ బతుకు మరింత దయనీయంగా మారిందని ఆందోళన చెందుతున్నారు ఇరాన్ ప్రజలు.








