ఏకంగా హిమాలయాన్నే చీల్చి దారి వేసిన నేపాల్!
మనం అరకు ఘాట్ రోడ్డులో ప్రయాణించినప్పుడు, తిరుమల ఘాట్‌లో ట్రాఫిక్‌లో చిక్కుకునప్పుడు, ఒక విషయం అనుకుంటాం. అబ్బా..ఈ కొండల మధ్య రోడ్డు నిర్మించడం ఎంత కష్టమో అని. అలాంటిది హిమాలయాల మధ్య ఉన్న నేపాల్ ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? దాదాపు ఏడుళ్ల పోరాటం తర్వాత ఒక పర్వతాన్ని చీల్చి తన చరిత్రలో తొలి ఆధునిక రోడ్డు టన్నెల్‌ను ప్రారంభించింది.
ప్రపంచంలోని అనేక దేశాలకు ఇది సాధారణ వార్త కావచ్చు. కానీ నేపాల్‌కు మాత్రం ఇది రోడ్డు ప్రారంభం కాదు… అభివృద్ధి వైపు వేసిన కొత్త అడుగు. ఇంత చిన్న విషయానికి ఇంత ప్రాధాన్యం ఎందుకని అనిపించొచ్చు. కానీ దేశాల అభివృద్ధిని కొన్నిసార్లు ఒకే ఒక్క ప్రాజెక్టు మార్చేస్తుంది. విమానాశ్రయం, పోర్టు, మెట్రో, లేదా ఒక టన్నెల్. అవి కాంక్రీట్ నిర్మాణాలే కాదు… ఆర్థిక వ్యవస్థ వేగాన్ని పెంచే మార్గాలు కూడా అనేది ఒప్పుకు తీరాల్సిన సత్యం.
నేపాల్ రాజధాని కాఠ్మండును కీలక రహదారితో కలిపే నాగ్‌ధుంగా–సిస్నేఖోలా టన్నెల్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నేపాల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి మంత్రి సునీల్ లాంసాల్తో పాటు జపాన్ రాయబారి మయెడా తోరు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) అధ్యక్షుడు తనాకా అకిహికో హాజరయ్యారు.
ఆశ్చర్యపరిచే విషయం
ఇంత కష్టపడి చేసిన ఈ టన్నెల్లో బైక్‌లు వెళ్లకూడదు. పాదచారులు కూడా వెళ్లలేరు. సైకిళ్లు, ఆటోలు వంటి వాహనాలకూ అనుమతి లేదు. అంతేకాదు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి అత్యంత మండే పదార్థాలను తీసుకెళ్లే వాహనాలను కూడా నిషేధించారు. సొరంగాల్లో చిన్న ప్రమాదం కూడా పెద్ద విపత్తుగా మారే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
టోల్ చెల్లింపుల విషయంలో కూడా నేపాల్ నేరుగా డిజిటల్ విధానాన్నే ఎంచుకుంది. RFID ఆధారిత ఎన్-ట్యాగ్ (N-Tag) వ్యవస్థను ప్రవేశపెట్టి, ముందుగానే రీచార్జ్ చేసుకున్న వాహనాలు ఆగకుండా టోల్ దాటేలా ఏర్పాట్లు చేసింది. మౌలిక సదుపాయాల నిర్మాణంతో పాటు వాటి నిర్వహణలో కూడా సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచన ఇందులో కనిపిస్తోంది.
ఈ ప్రాజెక్టు వెనుక జపాన్ కీలక పాత్ర పోషించింది. సుమారు రూ.21.5 బిలియన్ల రాయితీ రుణాన్ని జపాన్ అందించగా, మరో రూ.6 బిలియన్లను నేపాల్ ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టింది. నిర్మాణం ప్రారంభమైన తర్వాత దాదాపు 80 నెలలు పట్టింది. హిమాలయ ప్రాంతంలోని క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, వాతావరణ సవాళ్లు, ఇంజినీరింగ్ సమస్యలు ఎదురైనా ప్రాజెక్టును పూర్తి చేశారు.
జపాన్ ఎందుకు నేపాల్‌లో ఇంత భారీ పెట్టుబడి పెట్టింది?
ఇక్కడ ఇదే పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం కేవలం అభివృద్ధి సహకారం మాత్రమే కాదు. దక్షిణాసియాలో మౌలిక సదుపాయాల నిర్మాణం ఇప్పుడు భౌగోళిక రాజకీయాల భాగమవుతోంది. ఒకవైపు చైనా తన బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమం ద్వారా ప్రభావాన్ని పెంచుతుంటే, మరోవైపు జపాన్ కూడా నాణ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా నేపాల్ వంటి దేశాలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది. ఈ టన్నెల్ ఆ వ్యూహాత్మక సమీకరణలో ఇది చిన్న అడుగే కానీ ముఖ్యమైనది.
ఏం కలిసి వస్తుంది
ఈ టన్నెల్ వల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఇంధన వినియోగం తగ్గవచ్చు. సరకు రవాణా వేగవంతం కావచ్చు. అత్యవసర సేవలు మరింత త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఇవన్నీ కలిసి ఒక దేశ ఆర్థిక కార్యకలాపాలపై సానుకూల ప్రభావం చూపుతాయి.
ఇలాంటి ప్రాజెక్టులను చూస్తే మనకూ ఒక ఆలోచన వస్తుంది. కొండ ప్రాంతాల్లో రహదారి నిర్మాణం ఎంత కష్టమో మన దేశ ప్రజలకు కూడా తెలుసు. అయినా సరే, సాంకేతికత, దీర్ఘకాల ప్రణాళిక, రాజకీయ సంకల్పం కలిస్తే అసాధ్యంగా కనిపించిన పనులు కూడా సాధ్యమే అని నేపాల్ చూపించింది.
ప్రపంచ పటంలో విస్తీర్ణం పరంగా చిన్న దేశమే కావచ్చు. కానీ అభివృద్ధి పరంగా పెద్ద నిర్ణయాలు తీసుకుంటే పరిమాణం కాదు, దూరదృష్టే దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని నేపాల్ తొలి రోడ్డు టన్నెల్ మరోసారి గుర్తు చేసింది. కొండను చీల్చిన ఈ మార్గం… కేవలం వాహనాల కోసమే కాదు, ఒక దేశ భవిష్యత్తు వేగాన్ని పెంచే దారిగానూ నిలిచిపోవచ్చు.








