సామాజిక న్యాయంపై అధికార, ప్రతిపక్షాలకు కవిత సవాల్!
తెలంగాణ రాజకీయ యవనికపై సామాజిక న్యాయం చుట్టూ మళ్లీ వేడి రగులుతోంది. అణగారిన వర్గాల హక్కులు, ప్రాతినిధ్యం అంశాలను ప్రధాన అజెండాగా మార్చేందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇన్నాళ్లూ ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యమిచ్చాయని, సామాజిక న్యాయాన్ని పూర్తిగా విస్మరించాయని ఆమె చేసిన తీవ్ర విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
సామాజిక న్యాయం అనే పదం వినగానే ప్రధాన పార్టీలు భయపడుతున్నాయని, కానీ ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ధర్మపోరాటం అని కవిత అభివర్ణించారు. రాష్ట్రంలో బీసీల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఖ్యాపరంగా అధికులుగా ఉన్న బీసీలకు ప్రాతినిధ్యం విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ సభ తెలంగాణ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సంకల్ప సభ వేదికగా కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న అంతర్గత అవగాహనను కవిత తీవ్ర స్థాయిలో నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా తీర్మానించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.
మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరస్పరం ఆత్మీయంగా ప్రేమ లేఖలు రాసుకుంటారని, కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తెచ్చే విషయంలో మాత్రం ఈ స్నేహం, దోస్తీ ఎందుకు పనిచేయడం లేదని ఆమె ప్రశ్నించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా ఈ బీసీ బిల్లుకు కేంద్రం నుంచి ఆమోదం తీసుకురావాలని, లేనిపక్షంలో రాబోయే సంక్రాంతి పండుగ తర్వాత ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా భారీ ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టమైన హెచ్చరిక చేశారు.
తెలంగాణ సమాజంలో నేటికీ కుల వివక్ష వేళ్లూనుకుని ఉందన్న నిజాలను కవిత ఎత్తిచూపారు. తాను వ్యక్తిగతంగా అగ్రవర్ణ కుటుంబంలో జన్మించినప్పటికీ, తన ఆశయం, పోరాటం మాత్రం అణగారిన, వెనుకబడిన వర్గాల కోసమేనని పునరుద్ఘాటించారు. సమాజంలో మార్పు రావాలంటే అగ్రవర్ణాలకు చెందిన నాయకులు, ప్రజలు గౌతమ బుద్ధుని బోధనలను, ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే తెలంగాణలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ సేవలను స్మరించుకున్న కవిత, ఆయనకు తగిన గౌరవం దక్కలేదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ట్యాంక్‌బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆయనకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారం ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రానికి అధికారికంగా లేఖ రాయాలని స్పష్టం చేశారు.








