పంచారామ క్షేత్రాలను జాతీయ టెంపుల్ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలి
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలను ‘స్వదేశ్ దర్శన్ 2.0’ కింద జాతీయ టెంపుల్ టూరిజం – పంచారామ శివ టెంపుల్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి ఆయనకు వినతిపత్రంతో పాటు ప్రాజెక్ట్ సమగ్ర వివరాలను అందజేశారు.
స్వదేశ్ దర్శన్ 2.0 పథకంలో చేర్చి..
అమరావతి, ద్రాక్షారామం, సోమారం (పాలకొల్లు), కుమారారామం (సమర్లకోట), క్షీరారామం (భీమవరం) క్షేత్రాలను ఒకే ఆధ్యాత్మిక, పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం, ఉపాధి అవకాశాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు విశేష ప్రోత్సాహం లభిస్తుందని ఎంపీ కేంద్రమంత్రికి వివరించారు. బౌద్ధ, కృష్ణ సర్క్యూట్ల తరహాలో ‘పంచారామ శివ సర్క్యూట్’ను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా తీర్చిదిద్దాలని, ఇందుకోసం స్వదేశ్ దర్శన్ 2.0 పథకంలో చేర్చి ప్రత్యేక ప్రాజెక్ట్ నివేదిక (DPR) రూపొందించాలని కోరారు.
ఎన్హెచ్ఏఐతో సమన్వయం చేయాలని..
అలాగే పంచారామ క్షేత్రాలను అనుసంధానించే అమరావతి–ద్రాక్షారామం, సామర్లకోట–ద్రాక్షారామం, పాలకొల్లు–భీమవరం రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఎన్హెచ్ఏఐతో సమన్వయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ద్రాక్షారామంలోని శాసన సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం, పురావస్తు సంపద డిజిటల్ డాక్యుమెంటేషన్ చేపట్టడం, పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులు, డిజిటల్ గైడెన్స్, పార్కింగ్, సౌకర్యాల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని కోరారు.
ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖలతో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ సానా సతీష్ బాబు తెలిపారు. పంచారామ క్షేత్రాలకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడం, గోదావరి ప్రాంతాన్ని దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.








