అనంతపురం పాలిటిక్స్ హీట్.. జేసీ వర్సెస్ కేతిరెడ్డి
అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో అధికార టీడీపీ(TDP), ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో రాజకీయ ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగానే వైసిపి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్దవడుగూరులో ఒక భారీ నిరసన దీక్ష చేపట్టేందుకు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం అదే నియోజకవర్గ పరిధిలోని పెద్దవడుగూరులో స్థానిక టీడీపీ కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.
ఒకే లొకేషన్లో అటు ప్రతిపక్ష వైసీపీ నిరసన దీక్ష, ఇటు అధికార టీడీపీ కీలక నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం ఒకేసారి జరగనుండటంతో పెద్దవడుగూరులో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల క్యాడర్ భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పట్టణంలోని ముఖ్య కూడళ్లలో భారీగా పోలీసు బలగాలను మోహరించి నిఘా పెట్టారు. డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న అక్రమాల ఆరోపణలను తిప్పికొట్టేలా టీడీపీ నేతలు వ్యూహాలు రచిస్తుండటంతో తాడిపత్రి పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి.
రాజకీయంగా ఎప్పుడూ సెన్సేషనల్ గా ఉండే తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిల తాజా కదలికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నిరసన దీక్షకు పోలీసులు అనుమతి ఇస్తారా, లేదా అనే ఉత్కంఠ నడుస్తుండగానే ఇరు వర్గాలు సవాల్ ప్రతిసవాళ్లకు దిగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఒకే చోట జరుగుతున్న ఈ రెండు భిన్నమైన పొలిటికల్ యాక్టివిటీస్ రాబోయే గంటల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయోనని జిల్లా వ్యాప్తంగా సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయడానికి పోలీసులు ఇరు పార్టీల ముఖ్య నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు స్థానిక వర్గాల నుండి సమాచారం అందుతోంది.








