ఆ రెండు వార్తలు…కలిపి చదివితే ఒక షాకింగ్ నిజం!
కొన్ని వార్తలు విడివిడిగా చదివితే…
అవి కేవలం వార్తలుగానే కనిపిస్తాయి.కానీ…ఆ వార్తలను పక్కపక్కన పెట్టి చదివితే…అవి హెచ్చరికలుగా మారిపోతాయి. ఈ వారం కూడా అలాంటి రెండు వార్తలే వచ్చాయి.
మొదట వార్త… ప్రపంచ దిగ్గజ చెల్లింపుల సంస్థ Visa ప్రపంచవ్యాప్తంగా 2,600 మంది ఉద్యోగులను తొలగించింది. కొన్ని గంటల తర్వాత మరో వార్త వచ్చింది. అదే Visa సంస్ద.. 2.4 బిలియన్ డాలర్లతో BioCatch అనే టెక్నాలజీ కంపెనీని కొనుగోలు చేసింది. ఇది మోసాలను గుర్తించే అత్యాధునిక టెక్నాలజీపై పనిచేసే సంస్థ.వీటిని విడి విడిగా చదివితే… ఒకటి లేఆఫ్ వార్త. మరొకటి బిజినెస్ పెట్టుబడి వార్త. అంతే.
అయితే…ఈ రెండు వార్తలను ఒకే ఫ్రేమ్‌లో పెట్టి చూస్తే… ప్రపంచ కార్పొరేట్ రంగంలో నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. అది మనుషులపై ఖర్చు తగ్గుతోంది… టెక్నాలజీపై పెట్టుబడి పెరుగుతోంది. అదే అసలు కథ.
ఇది Visa కథ మాత్రమే కాదు… మారిపోతున్న కార్పొరేట్ ఆలోచనా విధానం కథ. ఒకప్పుడు కంపెనీల్లో ఉద్యోగాల కోత అంటే ఒకే అర్థం. వ్యాపారం బాగోలేదు. లాభాలు తగ్గాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారిపోయాయి.
Visa తాజా ఆర్థిక ఫలితాలను చూస్తే అది స్పష్టంగా తెలుస్తుంది. కంపెనీ మూడో త్రైమాసికంలో 11.6 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. గత ఏడాదితో పోలిస్తే అది 14 శాతం ఎక్కువ. నికర లాభం 5.6 బిలియన్ డాలర్లు.
అంటే కంపెనీ నష్టాల్లో లేదు. అయినా…ఉద్యోగాలు తగ్గిస్తోంది. అంతేకాదు ఈసారి వేటు జూనియర్లుపై మాత్రమే కాదు… పై అంతస్తుని కూడా కదిలించింది. ఆరుగురు వైస్ ప్రెసిడెంట్లు. 37 మంది సీనియర్ డైరెక్టర్లు. 16 మంది చీఫ్ ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు. దశాబ్దాల అనుభవం ఉన్న టెక్నాలజీ నిపుణులు కూడా ఈ కోతలో ఉన్నారు. ఇది ఒక్క కంపెనీ నిర్ణయం కాదు. ఇదో స్ట్రాంగ్ మెసేజ్.
ఇక మూడో వార్త భారత్ నుంచి వచ్చింది.
బెంగళూరులోని Visa టెక్నాలజీ సెంటర్లో కూడా సుమారు 500 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. అది అక్కడి ఉద్యోగుల్లో దాదాపు 14 శాతం. ప్రభావం ఎక్కువగా ప్రొడక్ట్, టెక్నాలజీ టీమ్ లపైనే పడింది. కొంతమందికి తెల్లవారుజామునే ఉద్యోగం ముగిసిందని ఈ-మెయిల్స్ వెళ్లినట్లు సమాచారం.
ఒక మెయిల్…కొన్ని నిమిషాలు… ఏళ్ల కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.ఇది ఒక్క Visa మాత్రమే కాదు. Mastercard ఉద్యోగులను తగ్గించింది. PayPal వేల మందిని తొలగించింది.Block కూడా అదే దారిలో నడిచింది. Intuit కూడా సిబ్బందిని తగ్గించింది. ఈ కంపెనీలన్నీ వేర్వేరు. కానీ నిర్ణయం మాత్రం ఒకటే.
ఇదే రేపటి ఉద్యోగాల కథ. మన భవిష్యత్తు కథ.








