కేబినెట్ విస్తరణకు రేవంత్ రెడ్డి సిద్ధం!?
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో కేబినెట్ కొలువుదీరలేదు. రెండు స్థానాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారా.. అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై అడుగులు ముందుకు పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా క్యాబినెట్‌ను పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ఒక సురక్షితమైన మధ్యేమార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. అసంతృప్తులకు తావివ్వకుండా, కేవలం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను మాత్రమే భర్తీ చేసి ప్రస్తుతానికి రాజకీయాన్ని చల్లబరిచేందుకు ఏఐసీసీ సిద్ధమైంది. వారం, పది రోజుల్లో, అంటే ఈ నెల 14వ తేదీ తర్వాత చిన్నపాటి విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
జులైలో ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నేరుగా రంగంలోకి దిగి రాష్ట్రంలోని పలువురు మంత్రులతో వరుసగా వ్యక్తిగత సమావేశాలు నిర్వహించారు. శాఖల పనితీరు, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, నాయకుల మధ్య సమన్వయం, వివిధ పోర్ట్‌ఫోలియోలకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై ఆమె ఒక సమగ్ర నివేదికను రూపొందించారు. ఈ సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధిష్టానం, ప్రస్తుత దశలో సమూల మార్పులు చేపడితే ఎదురయ్యే ముప్పును ముందే ఊహించింది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మంత్రుల రాజీనామాలు, తొలగింపుల వల్ల ఉత్పన్నమైన రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణలో అలాంటి అలజడులకు ఆస్కారం ఇవ్వకూడదని నిర్ణయానికొచ్చింది.
హైకమాండ్ సూచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి రెండు కీలక సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ఒకటి గిరిజన సామాజిక వర్గానికి, మరొక దాన్ని ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం లేని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఎస్టీ (లంబాడా) రేసులో గిరిజన సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర నాయక్, బాలు నాయక్ లేదా దేవరకొండ ఎమ్మెల్యే పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటి సీనియర్లు తమ శాయశక్తులా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా చర్చల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందే తనకు క్యాబినెట్లో చోటు కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన వర్గీయులు గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుత విస్తరణలో భారీగా పోర్ట్‌ఫోలియోలు మారుతాయా లేదా అనే అంశం పక్కన పెడితే, కొన్ని కీలక శాఖల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, మంత్రిపదవులు ఆశిస్తున్న నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, పదవులు దక్కని వారి నుంచి ఎలాంటి ప్రతిఘటన లేదా బహిరంగ అసంతృప్తి రాకుండా చూడటమే రేవంత్ రెడ్డికి, హైకమాండ్‌కు ఉన్న అతిపెద్ద సవాలు. ఇందుకోసం తుది ప్రకటనకు ముందే ఆశావాహులతో వ్యక్తిగతంగా చర్చలు జరిపి, వారికి ఇతర నామినేటెడ్ లేదా పార్టీ పదవుల హామీలతో బుజ్జగించే వ్యూహాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది.
మొత్తానికి, పెద్ద ఎత్తున రీషఫుల్ చేసి లేనిపోని చిక్కులు కొనితెచ్చుకోవడం కంటే, రెండు ఖాళీలను భర్తీ చేస్తూ సామాజిక సమతుల్యతను కాపాడుకోవడమే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్‌కు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఈ నెల 14 తర్వాత వచ్చే ఆ కీలక ప్రకటనతో కాంగ్రెస్ అంతర్గత రాజకీయ సమీకరణాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.








