తెలంగాణలో 70 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు!
తెలంగాణలో చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) చివరి ఘట్టానికి చేరుకున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఓటర్ల సర్వేకు సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ గడువు మరో మూడు రోజుల్లో ముగియనుండటంతో, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి. డిజిటలైజేషన్ మందకొడిగా సాగుతుండటం, వరుస ప్రభుత్వ సెలవులు రానుండటంతో నిర్దేశిత గడువు నాటికి ఈ ప్రక్రియ 80 శాతం దాటడం కూడా అనుమానంగానే కనిపిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, గురువారం సాయంత్రం 6 గంటల వరకు కేవలం 2,63,37,790 ఓటర్ల ఫారాలను అంటే 77.86శాతం మాత్రమే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఆన్లైన్ చేశారు. అంటే ఇప్పటికీ దాదాపు 20 శాతానికి పైగా ఎన్యూమరేషన్ పత్రాలు ఆన్లైన్ కాకుండా పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే ఆన్లైన్ నమోదుకు గడువు ఉంది. కానీ ఈ చివరి నాలుగు రోజుల్లో రెండో శనివారం, ఆదివారం, బోనాల పండుగ సందర్భంగా సోమవారం వంటి వరుస సెలవులు రావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రక్రియకు మిగిలింది కేవలం శుక్రవారం ఒక్క రోజే. గడువు ముగిసే నాటికి మరో ఒకటి, రెండు శాతం పెరిగినా.. ఓవరాల్‌గా 80 శాతం డిజిటలైజేషన్ కూడా పూర్తి కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ ఫారం సమర్పించకపోతే ఆ ఓట్లను రద్దు చేసినట్లే పరిగణిస్తారనే నిబంధన ఓటర్ల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.
రాజధాని హైదరాబాద్, దాని పరిసర జిల్లాలు ఓటర్ల స్పందన, సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియలో దారుణంగా వెనుకబడి ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 47,36,669 ఓటర్లు ఉండగా కేవలం 27,42,506 (57.90%) పత్రాల ప్రక్రియ మాత్రమే పూర్తయింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 29,79,130 ఓటర్లకు గాను 18,79,666 (63.09%) ఆన్లైన్ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 36,99,743 ఓటర్లలో 23,88,886 (64.57%) నమోదు సాధించాయి. సంగారెడ్డి లోని 14,57,436 ఓటర్లలో 11,50,096 (78.91%) ప్రక్రియ పూర్తయింది. వికారాబాద్ జిల్లాలో 10,17,671 మందికి గాను 8,04,045 (79.01%) పత్రాలు ఆన్లైన్ అయ్యాయి.
మొత్తంగా జీహెచ్ఎంసీ, దాని సమీప జిల్లాల్లో దాదాపు 35% నుండి 42% వరకు పత్రాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి భిన్నంగా గ్రామీణ జిల్లాలైన యాదాద్రి భువనగిరిలో అత్యధికంగా 94.30%, జనగామలో 91.66%, మహబూబాబాద్‌లో 90.08% మేర ఆన్లైన్ ప్రక్రియ పూర్తయి ముందంజలో నిలిచాయి.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగమైన వివిధ వర్గాల డేటాను విశ్లేషిస్తే భారీగా ఓట్లు చేజారిపోయే ప్రమాదం కనిపిస్తోంది. చనిపోయినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, విచారణలో చిరునామా లభించనివారు, డూప్లికేట్ ఓటర్లు కలిపి మొత్తం 56 లక్షల మందిని సర్వేలో గుర్తించారు. వీరందరి ఓట్లను దాదాపుగా జాబితా నుంచి తొలగించనున్నారు. దాదాపు 80 లక్షల మంది ఓటర్లలో 11 రకాల వ్యత్యాసాలు ఉన్నట్లు యంత్రాంగం గుర్తించింది. ఇందులో దాదాపు 20 శాతం (సుమారు 16 లక్షలు) ఓట్లలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నట్లు తెలిసింది. వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు, అలాగే అన్-మ్యాపింగ్ జరిగిన ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసు గడువులోగా వీరు తగిన గురింపు పత్రాలను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కు సమర్పించకపోతే ఆ ఓట్లను కూడా రద్దు చేస్తారు.
ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించకపోవడం, వ్యత్యాసాలకు ఆధారాలు చూపకపోవడం వల్ల ఊహించని రీతిలో 70 లక్షలకు పైగా ఓట్లు జాబితా నుంచి మాయమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. ఈ నేపథ్యంలో అధికారులు డిజిటలైజేషన్ గడువును పొడిగించడమో లేదా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించడమో చేయకపోతే లక్షలాది మంది ఓటర్లు తమ హక్కును కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.








